మంత్రులకు అగ్నిపరీక్షే!

By సుభాష్  Published on  7 March 2020 4:01 AM GMT
మంత్రులకు అగ్నిపరీక్షే!

ఏపీలో స్థానిక సమరం మొదలైంది. ఈనెల చివరివరకు జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో భాగంగా శనివారం స్థానిక సంస్థల ఎన్నికలపై షెడ్యూల్‌, నోటిఫికేషన్‌ విడుదకానుంది. ఇప్పటికే జడ్పీటీసీ, ఎంపీసీటీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఏపీలో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇదే సమయంలో మంత్రుల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల జరిగిన సమావేశంలో స్థానిక సమరంలో సత్తాచాటకుంటే మంత్రుల పదవులు ఊడతాయని సీఎం జగన్మోహన్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎలాగైనా తమతమ నియోజకవర్గాల్లో, జిల్లాల్లో సత్తాచాటాలని మంత్రులు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు.

మరోవైపు ఎమ్మెల్యేలకు సైతం జగన్‌ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. నియోజకవర్గాల్లో పార్టీ వెనుకబడితే వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఉండదని జగన్‌ కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. దీంతో నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించుకొనేందుకు మంత్రులు, ఎమ్మెల్యే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కానీ పలువురు మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు తమ అనుచరుల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వం పట్ల కొంత ప్రజావ్యతిరేఖత ఉందని, ఈ తరుణంలో మన ఇబ్బందులు తప్పవంటూ వాపోతున్నట్లు తెలుస్తోంది.

జగన్మోహన్‌రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి పలు సంచనల నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో కొన్ని ప్రజలచే శభాష్‌ అనిపించగా.. మరికొన్ని విమర్శల పాలయ్యాయి. మరీ ముఖ్యంగా మూడు రాజధానుల అంశం ఏపీని ఇప్పటికీ కుదిపేస్తుంది. అమరావతి నుంచి రాజధానిని విశాఖకుతరలించేందుకు వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. హైకోర్టు ఆదేశాలతో రాజధాని తరలింపు ప్రక్రియ కొంత నెమ్మదించింది. మూడు రాజధానుల ప్రకటన నాటి నుంచి ఇటు అమరావతి ప్రాంతాల్లోని ప్రజలు, అటు రాయలసీమ ప్రాంతాల్లోని కొందరు తీవ్ర వ్యతిరేకిస్తున్నారు. అయినా జగన్మోహన్‌రెడ్డి మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకపోవటంతో రాజధాని రైతులు యాబైరోజులకుపైగా ఆందోళనలకు కొనసాగిస్తూనే ఉన్నారు.

టీడీపీసైతం అంశాన్ని జాతీయ స్థాయిలో ప్రజెంట్‌ చేసి చర్చకు తెరలేపడంలో విజయవంతం అయింది. దీనికితోడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాచైతన్య యాత్రతో అన్ని ప్రాంతాల్లో మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ ప్రజల్లో ఉంటున్నారు. దీంతో ఏపీలోని అన్ని ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది.

మరోవైపు స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం 50 శాతం రిజర్వేషన్లతో ప్రక్రియ నడుస్తోంది. స్థానిక సంస్థల్లో 59. శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ గత డిసెంబర్ లో 176 జీవోను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై కొందరు సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడినుంచి కేసు హైకోర్టుకు వచ్చింది. విచారణ తరువాత 50శాతం రిజర్వేషన్లకు పరిమితం చేసింది హైకోర్టు. ఇదే అంశాన్ని టీడీపీ నేతలు అస్త్రంగా చేసుకుంటూ బీసీ వ్యతిరేకి వైకాపా ప్రభుత్వం అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో బీసీలు ఎక్కడ వ్యతిరేకిస్తారోనని పలువురు మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు సీఎం జగన్మోహన్‌రెడ్డి హెచ్చరికలు మంత్రులను మరింత ఆందోళనలకు గురిచేస్తున్నాయి. సీఎం ఆదేశాలతో ఇప్పటికే గ్రామాల బాట పట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని వ్యూహాలు సిద్ధంచేసుకుంటున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, జనసేన, బీజేపీలు సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా ప్రభాన్ని తగ్గిస్తే ప్రజల్లో జగన్‌ పాలన పట్ల వ్యతిరేఖత ఉందని స్పష్టం చేయవచ్చని భావిస్తున్నారు. దీంతో వైకాపాను ధీటుగా ఎదుర్కొనేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మంగా తీసుకొని ముందుకెళ్తున్నారు. ఈ తరుణంలో మంత్రులు, వైకాపా ఎమ్మెలు తమ టార్గెట్‌ను రీచ్‌ అయ్యి ఏమేరకు తమ పదవులను కాపాడుకుంటారోననే అంశం ఇప్పుడు ఏపీలో హాట్‌టాపిక్‌ మారింది.

Next Story