ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయనగరం జిల్లా చరిత్రలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ ట్రస్ట్‌ చైర్‌ పర్సన్‌గా ఆనంద గజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు ఇంతటి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి జగన్‌కు సంచయిత గజపతిరాజు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఎన్నో ఏళ్లుగా నిరంకుశంగా మాన్సాస్‌పై పెత్తనం చెలాయిస్తున్న వారికి గట్టి దెబ్బతగిలిందని చర్చలు మొదలయ్యాయి.

1958లో దివంగత పి.వి.జి. రాజు నెలకొల్పిన మాన్సాస్‌ సంస్థ విద్యావ్యవస్థను అభివృద్ధి పర్చేందుకు విద్యా సంస్థలను నడుపుతోంది. 1958లో సివిజి రాజు వ్యవస్థాపక చైర్మన్‌ కాగా, ఆనంద గజపతి రాజు, అశోక్‌ గజపతి రాజు ట్రస్ట్‌ బోర్డు సభ్యులుగా ఉండేవారు. 1994లో పివిజి రాజు మరణం అనంతరం ఆనంద  గజపతిరాజు చైర్మన్‌ అయ్యారు. ఇక 2016లో ఆయన మరణం తర్వాత అశోక్‌ గజపతి రాజు చైర్మన్‌ బాధ్యతలు చేపట్టారు. అశోక్‌ కుమార్తె అథితి గజపతిరాజు ట్రస్ట్‌ బోర్డు సభ్యులుగా తెరపైకి వచ్చారు. 13వేల ఎకరాల భూమి, విలువైన ఆస్తులను కలిగిన మాన్సాస్‌ సంస్థ చైర్మన్‌గా, సింహాచలం దేవస్థానం ధర్మకర్తగా కేంద్ర మాజీ అశోక్‌ గజపతిరాజు ఇప్పటి వరకు కొనసాగారు. ఇప్పుడు సంచయిత గజపతిరాజును ట్రస్ట్‌ బోర్డు చైర్‌ పర్సన్‌గా నియామకం అయ్యారు. సింహాచలం ట్రస్ట్‌ బోర్డు చైర్‌ పర్సన్‌ పదవిని చేపట్టిన మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టించింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.