నా మతం, కులంపై వస్తున్న ఆరోపణలు వింటుంటే బాధేస్తోంది: సీఎం వైఎస్ జగన్
By అంజి Published on 2 Dec 2019 3:18 PM ISTముఖ్యాంశాలు
- వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
- ప్రతిపక్షాల ఆరోపణలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ సీఎం జగన్
- నా కులం మాట నిలబెట్టుకునే కులం: సీఎం వైఎస్ జగన్
గుంటూరు: వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తున్నామని.. ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటామన్నారు. రాష్ట్రంలో మంచి పరిపాలన జరుగుతుంటే ప్రతిపక్షాలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాయని సీఎం జగన్ మండిపడ్డారు. ఈ మధ్య కాలంలో తన మతం గురించి, కులం గురించి మాట్లాడుతున్నారని, ఇలాంటి మాటలు విన్నప్పుడు చాలా బాధేస్తోందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. తన మతం మానవత్వంమని, తన కులం మాట నిలబెట్టుకునే కులమని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అవాకులు, చెవాకులు పక్కన పెడతానన్నారు.
గుంటూరులో జీజీహెచ్‌లో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆరోగ్యశ్రీ పథకంలో ఆపరేషన్ చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం రెస్ట్ తీసుకునే కాలానికి డబ్బు చెల్లించనున్నారు. ఆపరేషన్ తర్వాత వైద్యులు చెప్పిన సమయానికి రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేలు అందించనున్నారు. ఈ పథకం ద్వారా ఏటా 4.5 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఓ గొప్ప కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టామని సీఎం జగన్ అన్నారు. పేద ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు. లబ్దిదారులకు సీఎం జగన్ ఆరోగ్య శ్రీ చెక్కులు పంపిణీ చేశారు. వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ వర్తించేలా కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టారు. జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్య శ్రీకార్డులు మంజూరు చేస్తామని సీఎం జగన్ తెలిపారు. ఏప్రిల్ నాటికి 1060 అంబులెన్స్ కొనుగోలు చేస్తామన్నారు. మూడు నెలల్లో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామన్న సీఎం జగన్.. డిసెంబర్ 15 నాటికి 510 రకాల మందులు అందుబాటులోకి తెస్తామన్నారు. జనవరి 1 నుంచి తలసేమియా రోగులకు రూ.10 వేలు ఫించన్ అందజేస్తామని తెలిపారు.