2018వీపీ-1 గ్రహశకలం.. భూమికి దగ్గరగా దూసుకువస్తోంది..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Aug 2020 2:35 PM ISTభూగ్రహానికి అత్యంత దగ్గరగా గ్రహ శకలం రాబోతోంది. నవంబర్ 2న భూమికి అత్యంత దగ్గరగా ఈ గ్రహ శకలం వెళ్లే అవకాశం ఉందని నాసా చెబుతోంది. భూగ్రహ వాసులెవరూ భయపడాల్సిన అవసరం లేదని కూడా నాసా స్పష్టం చేసింది.
భూమికి 482 కిలోమీటర్ల దూరం నుంచి ఈ గ్రహ శకలం వెళ్లబోతోందని నాసా తెలిపింది. ఈ గ్రహశకలం 6.5 అడుగుల పొడవు ఉంటుందని, ఇది భూమిని తాకే అవకాశం 0.41శాతమేనని పేర్కొంది. ఆస్టరాయిడ్‌ను 2018లో క్యాలిఫోర్నియాలోని పాలోమార్ అబ్జర్వేటరీ గుర్తించింది. దీనికి 2018వీపీ-1గా నామకరణం చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఒక రోజు ముందు నవంబర్ 2న ఈ గ్రహశకలం భూమిని సమీపంగా వెళ్లే అవకాశం ఉందని సెంటర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ (సీఎన్‌ఈఓఎస్) తెలిపింది.
ఈ మధ్యనే దక్షిణ హిందూ మహాసముద్రానికి 2,950 కిలోమీటర్ల దూరంలో ఆస్టరాయిడ్ 2020 క్యూజీ భూమికి అతి సమీపంగా వచ్చింది. గ్రహశకలాలు భూమి వాతావరణంలోకి రాగానే మండిపోతూ ఉంటాయని చాలా మందికి తెలిసిందే..! కానీ చిన్న చిన్న గ్రహశకలాలు పెద్ద విధ్వంసమే సృష్టించే అవకాశం ఉంది. అందుకే శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటారు. సుదూర ప్రాంతంలో ఉన్న గ్రహశకలాలను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు.
"Asteroid 2018VP1 is very small, approx. 6.5 feet, and poses no threat to Earth!," అంటూ నాసా ఆస్టరాయిడ్ వాచ్ ఆగష్టు 23న ట్వీట్ చేసింది. 1998 నుండి భూమికి దగ్గరగా ఉన్న వస్తువులను నాసా పరిశీలిస్తూ ఉంది. దాదాపు 19000కు పైగా నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ ను నాసా గుర్తించింది. వీటిలో ఏవి కూడా భూమికి ప్రమాదకరంగా మారవని చెబుతూ ఉంది నాసా.