మహారాష్ట్రలో బీజేపీ మహా సర్జికల్ స్ట్రైక్ చేసింది. అలా ఇలా కాదు.. శివసేనాని ఉద్దవ్ థాక్రేకు ఊహించి అదను చూసి దెబ్బ కొట్టింది. తాజాగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినా.. బీజేపీ, శివసేన కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బీజేపీకి 105 సీట్లు, శివసేనకు 56 సీట్లు కట్టబెట్టారు దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యరీతిలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య‌మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. శ‌నివారం మ‌రాష్ట్ర రాజకీయాల్లో 180 డిగ్రీల మలుపుతో చాలా మందికి ఆశ్చర్ క‌లిగించింది. మహారాష్ట్రలో బీజేపీ, అజిత్ పవార్ మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపరచాణుక్యుడిలా వ్యవహరించి భారత రాజకీయాల్లో మరోసారి రుజువు చేసుకున్నారు. దేశ రాజ‌కీయాల‌ను నిమిషాల్లోనే తారుమారు చేసే వ్య‌క్తి ఎవ‌రంటే అమిత్ షా అనే చెప్పాలి. దేశ రాజ‌కీయాలు ఎలా ఉన్నా… చివ‌రి క్ష‌ణాల్లో అమిత్ షా వ్యూహం ఫ‌లిస్తుంది. మహారాష్ట్రలో ముఖ్య‌మంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ లతో కలిసి ప్రభుత్వాన్ ఏర్పాటు చేయ‌డంలో అమిత్ షా కీలకపాత్ర పోషించార‌నే చెప్పాలి. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనల కూటమి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు తుదిదశలో ఉన్న తరుణంలో అమిత్ షా వేసిన రాజకీయ ఎత్తుగడ ఫలించింది.

రాత్రికి రాత్రే సమీకరణాలు మారిపోయాయి. తెల్లారి లేచి చూచేసరికి మరాఠ రాజకీయాలు ఎవ్వ‌రు ఊహించని మలుపు తిర‌గాయంటే అది అమిత్ షా వ్యూహ‌మ‌నే చెప్పాలి. అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటామన్న శివసేన కలలను బీజేపీ, ఎన్సీపీ ఒక్క‌సారిగా భగ్నం చేశాయి. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి సీటులో కూర్చోవడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ మ‌రోసారి ముఖ్మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. బీజేపీ, ఎన్సీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేశాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది.

ముంబై నగర మేయర్‌ పదవిని ఏకగ్రీవంగా దక్కించుకున్నామని తెగ సంబ‌ర‌ప‌డిపోతున్న శివసేనను.. బీజేపీ-ఎన్సీపీ కలిసి ఏకంగా రాష్ట్రంలో అధికారానికి దూరం చేశాయి. శివసేన-ఎన్సీపీ పొత్తును విమర్శించిన బీజేపీ తెల్లారేసరికి ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం మహా విశేషం. మహారాష్ట్రలో స‌ర్కార్‌ ఏర్పాటు చేయడం ద్వారా అమిత్‌ షా, నరేంద్ర మోదీ మరోసారి తమ ప్రత్యేకత చాటుకున్నార‌నే చెప్పాలి. వీరిద్దరి ముందు శివసేన, కాంగ్రెస్‌ పార్టీలు ఎన్ని ఎత్తులు వేసినా చివ‌ర‌కు నిరాశే ఎదురైంది.

రెండు రోజుల క్రితం ప్రధాని మోడీని ఢిల్లీలో శరద్‌ పవార్‌ కలిసినప్పుడే మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం ఖాయమని వచ్చిన వార్తలు ఈ రోజు నిజమయ్యాయి. కాంగ్రెస్‌, శివసేన చర్చలు జరుపుతూనే అమిత్‌షా చాణిక్యం ప్రదర్శించడం విశేషం. అయితే తాజా పరిణామం పవార్‌కు తెలియకుండా జరిగిందని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి శివసేన, కాంగ్రెస్‌ పార్టీలకు ఊహించని షాకివ్వడం ద్వారా మోదీ-షా ప్లాన్‌ సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.