Fact Check : కరోనా నుండి కోలుకున్నాక అమితాబ్ బచ్చన్ హాజి అలీ దర్గాకు వెళ్ళారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Sept 2020 3:42 PM IST
Fact Check : కరోనా నుండి కోలుకున్నాక అమితాబ్ బచ్చన్ హాజి అలీ దర్గాకు వెళ్ళారా..?

కరోనా మహమ్మారి సోకిన ప్రముఖుల్లో అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. ఆయన ఇటీవలే రికవరీ అయ్యారు. తన 'కౌన్ బనేగా కరోడ్ పతి' ప్రోగ్రాం షూటింగ్ లో తిరిగి పాల్గొంటూ ఉన్నారు.

కరోనా నుండి కోలుకున్న అమితాబ్ బచ్చన్ ముంబై లోని హాజీ అలీ దర్గాకు వచ్చి దుప్పటిని ఇచ్చారని చెబుతూ ఓ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఆ సమయంలో అమితాబ్ నలుపు రంగు టోపీ పెట్టుకుని కనిపించారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పలు పోస్టులు వెలుస్తూ ఉన్నాయి. అమితాబ్ కు వ్యతిరేకంగా పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు. అంతేకాదు 'కౌన్ బనేగా కరోడ్ పతి' అనే ప్రోగ్రామ్ ను బాయ్ కాట్ చేయాలని పలువురు పిలుపును ఇస్తూ ఉన్నారు. అమితాబ్ కు కరోనా సోకినప్పుడు ఆయన ఆరోగ్యం బాగుండాలంటూ అందరూ గుళ్లకు తిరిగి ప్రార్థనలు చేస్తే.. కరోనా నుండి కోలుకున్న బిగ్ బీ మసీదు వెళ్లి చాదర్(దుప్పటి) ని సమర్పించాడు అని పలువురు ఆ ఫోటోను షేర్ చేస్తున్నారు.

ఫేస్ బుక్, ట్విట్టర్ లో కూడా ఈ ఫోటోను పలువురు షేర్ చేశారు.

నిజ నిర్ధారణ:

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి 'నిజం లేదు'.

ఈ ఫోటో దాదాపు తొమ్మిది సంవత్సరాల కిందటిది..! ఆయన వెళ్ళింది కూడా అజ్మీర్ షరీఫ్ దర్గాకు.. హాజీ అలీ దర్గాకు కాదు. కాబట్టు వైరల్ అవుతున్న పోస్టులు పచ్చి అబద్ధం.

గూగుల్ రివర్స్ సెర్చ్ ఆధారంగా ఈ ఫోటో 2011కు చెందినది. India Today 2011లో ఈ ఫోటోను పోస్టు చేసింది. వైరల్ ఫోటో కు సంబంధించిన గ్యాలరీ కూడా ఉంది. జులై 4, 2011న ఈ ఘటన చోటుచేసుకుంది. అమితాబ్ బచ్చన్ రాజస్థాన్ రాష్ట్రం లోని అజ్మీర్ లోని మొయినుద్దీన్ చిస్తీ దర్గాకు వెళ్లారు. వెల్వెట్ రంగులో ఉన్న దుప్పటిని అక్కడ బహూకరించారు.

The Hindu లో కూడా అమితాబ్ బచ్చన్ రాకకు సంబంధించిన వార్తను ప్రచురించారు. అప్పట్లో అమితాబ్ కూడా తన పర్యటన గురించి ట్వీట్ చేశారు. తాను 40 సంవత్సరాల తర్వాత అజ్మీర్ దర్గాను వచ్చానని తెలిపారు.

తన కోరిక ఒకటి నెరవేరిందని అందుకే తాను అజ్మీర్ దర్గాకు వచ్చినట్లు అమితాబ్ తెలిపారు. అమితాబ్ అప్పట్లో అజ్మీర్ దర్గాకు వెళ్లిన వీడియోలు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి.

Livemint కథనం ప్రకారం హాజీ అలీ దర్గాను కరోనా కారణంగా మూసి వేశారు. దర్గాను తెరిచే విషయాన్ని ఇంకా అధికారులు ధృవీకరించారు.

వైరల్ అవుతున్న పోస్టు 'నిజం కాదు'

Next Story