నిలకడగా అమితాబ్‌ ఆరోగ్యం.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 July 2020 6:40 AM GMT
నిలకడగా అమితాబ్‌ ఆరోగ్యం.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బ‌చ్చ‌న్‌కు క‌రోనా సోకిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా.. ఆస్పత్రి యాజమాన్యం అమితాబ్‌ ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్‌ విడుదల చేసింది. అమితాబ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, లక్షణాలు స్వల్ప స్థాయిలో ఉన్నట్ల వెల్లడించారు. ప్రస్తుత్తం అమితాబ్‌ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ విభాగంలో ఉన్నట్లు తెలిపారు. అభిషేక్ బచ్చన్‌ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

తనకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిందని అమితాబ్‌ బచ్చన్‌ శనివారం రాత్రి ట్వీట్‌ చేశారు. ‘నాకు కోవిద్ పాజిటివ్ వచ్చింది. ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. కుటుంబ సభ్యులకు, నా స్టాఫ్ కు టెస్టులు చేశారు.. రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాం. గత పది రోజులుగా తనకు దగ్గరగా వచ్చిన వారందరూ ఓ సారి టెస్టులు చేయించుకోండి’ అని బిగ్ బీ తెలిపారు.

78 ఏళ్ల అమితాబ్ బచ్చన్‌కు కాలేయ సమస్యలతో సహా పలు అనారోగ్య ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో అమితాబ్‌కు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఆయ‌న మరింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నిపుణులు అంటున్నారు. క‌రోనా బారిన ప‌డిన అమితాబ్ కోలుకోవాల‌ని సినీతారలు మొద‌లుకొని అభిమానుల వ‌ర‌కూ అంద‌రూ ప్రార్థ‌న‌లు చేస్తున్నారు.

'మీరు త్వరగా కోలుకోవాలని మేమంతా కోరుకుంటున్నాము అమిత్‌ జీ' అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.'డియర్‌ అమిత్‌ జీ.. మీరు త్వరగా కోలుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము' అని అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు.అలాగే, మ‌హేశ్ బాబు‌, ర‌వితేజ‌, రాశీఖ‌న్నా, తాప్సీ, ప్రియ‌మ‌ణి, నిత్యామీన‌న్‌తో పాటు పలువురు అమితాబ్ బచ్చన్‌ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నామ‌ని పేర్కొన్నారు. అమితాబ్‌ బచ్చన్ త్వరలోనే కోలుకుని తిరిగి ఆరోగ్యవంతంగా కనపడతారని ఆకాంక్షిస్తున్నట్లు బాలీవుడ్ నటులు మాధురీ దీక్షిత్, సోనం కపూర్, షాహిద్‌ కపూర్, రితీష్ దేశ్‌ముఖ్‌తో పాటు పలువురు ట్వీట్లు చేశారు.

Next Story