35 మంది చైనా సైనికులు చనిపోయారంటున్న అమెరికా ఇంటెలిజెన్స్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Jun 2020 12:30 PM IST
35 మంది చైనా సైనికులు చనిపోయారంటున్న అమెరికా ఇంటెలిజెన్స్

భారత్-చైనా సరిహద్దుల్లో సైనికుల మధ్య జరిగిన గొడవల్లో భారత్ కు చెందిన 20మంది సైనికులు మరణించారని అధికారులు తెలిపారు. చైనాకు చెందిన 43 మంది సైనికులు ప్రాణాలు వదిలారంటూ ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. కానీ చైనాకు చెందిన అధికారులెవరూ ఈ విషయంపై స్పందించలేదు.



అమెరికా ఇంటెలిజెన్స్ ప్రకారం 35 మంది చైనా సైనికులు మరణించారని అంటున్నారు. చైనా ఆర్మీకి చెందిన ఓ సీనియర్ అధికారి కూడా ఈ గొడవలో మరణించాడని అమెరికన్ ఇంటెలిజెన్స్ తెలిపింది. గల్వాన్ లోయ వద్ద జూన్ 15న భారత్-చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న గొడవలో భారత సైనికుల మరణాల కంటే.. చైనా సైనికుల మరణాలే ఎక్కువ ఉన్నాయని అమెరికాకు చెందిన వార్తా సంస్థలు ప్రచురించాయి. తమ మిలటరీకి అవమానంగా భావించి చైనా ఈ విషయాన్ని బయటకు చెప్పాడం లేదని అంటున్నాయి.

భారత్‌-చైనా మధ్య చోటు చేసుకుంటోన్న ఘర్షణల నేపథ్యంలో చైనా సీనియ‌ర్ క‌ల్న‌ల్ జాంగ్ షూలీ స్పందిస్తూ ఇండియాపై ఆరోపణలు చేశారు. భారత సైన్యం వాస్తవాధీన రేఖను దాటి వచ్చిందని, రెచ్చ‌గొట్టే చర్యలకు పాల్ప‌డ‌డం వల్లే హింసాత్మకంగా భౌతిక దాడులు జ‌రిగాయని చెప్పారు. శాంతి కోసం ఇరు దేశాల అగ్రశ్రేణి క‌మాండ‌ర్ల స్థాయి చ‌ర్చ‌లు జ‌రిగిన అనంతరం కూడా భార‌త సైన్యం నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిందని ఆరోపించారు.

చైనా సైనికులు, భారీ ఎత్తున రాళ్లు, ఇనుప రాడ్లు, ముళ్ల తీగలు చుట్టిన వెదురు బొంగులను సిద్ధం చేసుకుని దాడికి దిగారని భారత్ ఆర్మీ అధికారి తెలిపారు. అలా దాడి చేయడమే కాకుండా.. భారత సైనికులపై రాళ్లు రువ్వారని.. ఆ ఆర్మీ అధికారి తెలిపారు. వెదురు బొంగులకు చుట్టిన ఇనుప తీగలతో దాడి చేయడం వల్లే ప్రాణ నష్టం అధికంగా ఉందన్నారు. భారత సైనికులు తేరుకుని ప్రతిదాడికి దిగి దీటైన సమాధానాన్ని ఇవ్వడంతో చైనా సైనికులు కూడా పెద్దఎత్తున మృత్యువాతపడ్డట్లు తెలుస్తోంది. మృతి చెందిన చైనా సైనికులను హుటాహుటిన అక్కడి నుంచి తరలించేందుకు దాదాపు 7 హెలికాప్టర్లను చైనా వినియోగించింది.

Next Story