డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎవరు?
By అంజి
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రేస్ మొదలైంది.అధ్యక్ష పదవికి ప్రధానంగా రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీల మధ్యే పోటీ ఉంటుంది. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌తో తలపడేందుకు 20మందికి పైగా అభ్యర్థులు సిద్ధమైనప్పటికీ ప్రాధమికంగా జరిగే ప్రైమరీస్ ఎన్నికల సమయానికి వీరి సంఖ్య 11కి తగ్గింది. సాధారణంగా అమెరికాలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రైమరీస్, కాకసస్ అనే రెండు పద్ధతుల ద్వారా తమ అభ్యర్థులను ఎన్నుకుంటాయి. యుద్ధాలు, విద్వేషాలు, అభిశంసన ప్రక్రియతో ట్రంప్ అపఖ్యాతిని మూటగట్టుకున్నప్పటికీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్టే. ఇప్పుడు డెమొక్రాట్ల తరపున అధ్యక్ష అభ్యర్థిగా ఎవరు ఎన్నికవుతారన్నదే కీలకం. ఈ ఎన్నికల క్రమంలో అయోవా ప్రైమరీ మొట్టమొదటిది.
ప్రైమరీస్ ఎన్నికల ప్రక్రియలో మొదట పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నవారంతా ప్రసంగిస్తారు. స్థానిక వేదికలపై నిర్వహించే ఈ సమావేశాలలో డెమొక్రాటిక్ పార్టీ ఓటర్లు బృందాలు బృందాలుగా గుమి కూడి తమకు నచ్చిన అభ్యర్థులు, వారి ప్రతినిధులకు ఓటు చేస్తారు. ఈ ఓటింగ్‌లో 15 శాతం కన్నా తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి రేస్ నుంచి తప్పుకుంటారు. అతనికి వచ్చిన ఎలక్టొరల్ ఓట్లను డెమొక్రాటిక్ పార్టీకి చెందిన ప్రధాన ప్రత్యర్థులిద్దరికి తగు నిష్పత్తిలో కేటాయిస్తారు. మొత్తానికి ప్రైమరీస్‌లో ఎవరికి ఎక్కువమంది ప్రతినిధుల మద్దతు లభిస్తుందో వారే నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌తో తలపడతారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి మొదలై జూన్ మొదటివారం వరకు ఈ ప్రైమరీస్, కాకసస్ ఎన్నికలు జరుగుతాయి.
అధ్యక్ష ఎన్నికలకు ముందస్తుగా జరిగే ఈ ప్రైమరీస్ ఎన్నికలకు ప్రచారం గత కొన్ని వారాలుగా ప్రచారం ఉధృతంగా సాగింది. సోమవారం రాత్రి 8 గంటలకు ఈ ప్రైమరీ పోలింగ్ ప్రారంభమైంది. ఇందుకోసం డెమొక్రాటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి నామినేషన్ కోసం తలపడుతున్న డెమొక్రాటిక్ సోషలిస్టు బెర్నీ శాండర్స్, జోరు బిడెన్, ఎలిజబెత్ వారెన్, అమీ క్లోబూచర్ ఆదివారం సాయంత్రానికే ఇక్కడికి చేరుకున్నారు.