అమెరికా అధ్యక్ష ఎన్నికలు: ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలవడం కష్టమేనా..?
By సుభాష్ Published on 6 July 2020 12:51 PM ISTఒకవైపు కరోనా.. మరో వైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు. ఈ తరుణంలో అంతర్జాతీయంగా ప్రత్యేక దృష్టి అమెరికా ఎన్నికలపై పడింది. విపక్ష డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బిడెన్ అభ్యర్థిత్వం అధికారికంగా ఖరారు కావడంతో ఎన్నికల ఘంటారావం ప్రారంభమైనట్లయింది. రిపబ్లికన్ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరు ఎప్పుడో ఖరారైపోయింది. ఇక ట్రంప్ ప్లోరిడా రాష్ట్రానికి చెందిన వారు కాగా, బిడెన్ డెలావర్ రాష్ట్రానికి చెందిన వారు. సాధారణంగా అమెరికా ఎన్నికలంటే ఆ దేశానికే కాకుండా ప్రపంచానికి ఎంతో ఆసక్తి ఉంటుంది. అది అనుసరించే ఆర్థిక, పారిశ్రామిక, విదేశాంగ విధానాలు, ఆయా దేశాలపై వాటి ప్రభావం గురించి ఎంతో చర్చ జరుగుతోంది. దీంతో అక్కడి అభ్యర్థుల ప్రభావం, గెలుపు ఓటములపై ఆసక్తి నెలకొంటుంది. నవంబర్ 3న ఈ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. బిడెన్ కి విదేశీ వ్యవహారాల నిర్వహణ పట్ల అవగాహన, సుదీర్ఘ రాజకీయ అనుభవం, సాధారణ ప్రజానీకాన్ని మెప్పించగలిగే వాక్చాతుర్యం, జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్న అనుభవం ఉన్నాయని ఆయన మద్దతుదారుల అభిప్రాయం.
అయితే బిడెన్‌కు విదేశీ వ్యవహారాల నిర్వహణ పట్ల ఎంతో అవగాహన ఉందని, సుదీర్ఘ రాజకీయ అనుభవం, సాధారణ ప్రజానీకానికి మెప్పించ గలిగే వాక్చాతుర్యం, జీవితంలో ఒడిదొడుకులను ఎదుర్కొన్న అనుభవాలు ఉన్నాయని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు. దీంతో ట్రంప్‌ను వైట్ హౌస్ నుంచి పంపించే శక్తి బిడెన్‌కు ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం కరోనాను ఎదుర్కొంటున్న తీరు, చైనా, అమెరికా వాణిజ్యం యుద్ధం, వలస విధానాలు, ఆరోగ్య విధానాలు తదితర అంశాలు ప్రధానంగా ప్రచారంలోకి రానున్నాయి. గత నాలుగేళ్లలో ట్రంప్ విధానాలు, సాధించిన విధానాలు, అలాగే ఎదుర్కొన్న వైఫల్యాలు, ఆయన వ్యక్తిగతం పనితీరుపై విశ్లేషణ జరగనుంది. అయితే కరోనాను ఎదుర్కొవడంలో వైఫల్యం ట్రంప్ విజయానికి గండికొట్టే అవకాశాలున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక అదే సమయంలో నల్లజాతీయుడైన ఆప్రో- అమెరికన్ జార్జిప్లాయిడ్ హత్య ట్రంప్‌కు పెద్ద ఎదురుదెబ్బేనని తెలుస్తోంది. కానీ ఈ ఘటన ట్రంప్ అనుకూలంగా మలుచుకుని శ్వేత జాతీయులను రెచ్చగొట్టడం ద్వారా లబ్దిపొందే అవకాశాలు కూడా ఉన్నట్లు పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అలాగే నల్లజాతీయుడు ప్లాయిడ్ హత్యకు నిరసనగా జరుగుతున్న ఆందోళనలకు వ్యతిరేకంగా శ్వేతజాతీయులైన అమెరికన్లను ట్రంప్ రెచ్చగొడుతున్నారనే అభిప్రాయం కూడా ఉంది. నిరసనలు తెలియజేయడం అమెరికా సమాజంలో హక్కు అయినప్పటికీ, ఆస్తుల విధ్వంసాన్ని అక్కడి సమాజం ఏ మాత్రం ఒప్పుకోదు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లను రిపబ్లికన్లు, ట్రంప్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల డెమొక్రటిక్ గవర్నర్లు అల్లర్లను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్లాయిడ్ విషయంలో అదే పనిగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిని ట్రంప్ అవకాశంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అమెరికన్లు ఫస్ట్ అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్.. ఇప్పటికి అదే నినాదాన్ని వినిపిస్తున్నారు. విద్య, ఉద్యోగాల్లో గత నాలుగు సంవత్సరాలుగా వలస ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు
కాగా, ట్రంప్‌కు ప్రతికూల అంశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కరోనా వైరస్‌ను ఎదుర్కొవడంలో ఆయన విఫలమయ్యారని ఆరోపణలున్నాయి. కరోనా కేసులు 20 లక్షలకు చేరువయ్యాయి. మరణాలు లక్షాకుపైగా దాటిపోయాయి. దేశంలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన న్యూయార్క్ శవాల దిబ్బగా మారిపోయింది. మృతదేహాలను సైతం ఖననం చేసేందుకు కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. శాంతి భద్రతలు క్షీణించడం కూడా ట్రంప్‌కు ప్రతికూలంగా మారనుంది. స్వయంగా అధ్యక్షుడు బంకర్‌లో తలదాచుకోవాల్సిన పరిస్థితి నెలకొందంటే శాంతి భద్రతలు ఏ మేరకు ఉన్నాయో అర్థమైపోతోంది.
2001లో కూడా ట్రేడ్ కార్యాలయంపై ఉగ్రదాడి జరిగిన సందర్భంగా అప్పటి అధ్యక్షుడు జార్జిబుష్ బంకర్‌లోకి వెళ్లారు. మళ్లీ దాదాపు 20ఏళ్ల తర్వాత ఈ పరిస్థితి రావడానికి ట్రంపే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.