ట్రంప్‌ ఇలాఖాలో కరోనా కేసులు 10 లక్షలు దాటే సంకేతాలు

By సుభాష్  Published on  5 April 2020 10:15 AM GMT
ట్రంప్‌ ఇలాఖాలో కరోనా కేసులు 10 లక్షలు దాటే సంకేతాలు

కరోనా వైరస్‌.. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకుపుడుతుంది. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేస్తోంది. మృత్యువును వెంటాడుతోంది. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్‌.. ఇతర దేశాలన్నింటికి చాపకింద నీరులా పాకేసింది. మొదట పాజిటివ్‌ కేసుల సంఖ్య, మరణాల సంఖ్యలో మొదటి స్థానంలో చైనా ఉండగా, రెండో స్థానంలో ఇటలీ ఉండేది. ఇక చైనాను దాటేసిపోయిన ఇటలీ మొదటి స్థానంలో చేరిపోయింది. ఇక ప్రపంచ దేశాల పెద్దన్నగా, అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. అమెరికాలో ఇప్పటికే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3 లక్షల 11వేల 637కుపైగా చేరగా, మరణాల సంఖ్య 8వేల 454 వరకు చేరింది.

ఇంత టెక్నాలజీ ఉన్న అమెరికా దేశం కంటికి కనిపించన శత్రవును ఏమి చేయలేకపోతోంది. కరోనా వల్ల అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. మున్ముందు పరిస్థితి తీవ్రతరమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. కరోనాను అరికట్టేందుకు ట్రంప్‌ ముందు నుంచి చర్యలు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఎలాంటి సమయంలోనైనా కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రగల్బాలు పలికిన ట్రంప్‌కు గట్టి షాకిచ్చినట్లయింది. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థతి నెలకొంది. గంట గంటకు కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇక వచ్చే రెండు వారాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, దాదాపు 10 లక్షలు దాటే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కారణాలివి..

వచ్చే రెండు వారాల్లో అమెరికా ప్రజలు ఇష్టమొచ్చినట్లుగా తిరిగారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కాకుండా తిరగడంతో ఆయా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వచ్చే రెండు వారాల్లో ఈ కేసులన్నీ బయటపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదైన రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత జీరో నుంచి 5 డిగ్రీలు ఉంది.

ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం పెద్దన్న పెద్దగా చర్యలు చేపట్టకపోవడంతో కరోనా కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కారణాలతోనే అమెరికాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10 లక్షలు దాటవచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు.

అలాగే మృతుల సంఖ్య కూడా భారీగానే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు జరిగిన నష్టం జరిగిపోయిన తర్వాత ఇప్పుడెన్ని చర్యలు తీసుకున్నా.. కొంత మేర నష్టం జరగకుండా చూసుకోవచ్చు తప్ప ఇంకేమి చేయలేమని చెబుతున్నారు. ఎందుకంటే ఈ వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా మంది వైరస్‌ సోకిన వారు ఎక్కడెక్కడో తిరిగి, ఎంతో మందికి అంటించి ఉంటారని, మిగతా వారు కూడా ఇళ్లకే పరిమితం కాకుండా ఇంకెంతో మందికి కలిసిన కారణంగా ఈ వైరస్‌ ఇంకా ఎక్కువగా వ్యాపించిందని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ట్రంప్‌కు గడ్డుకాలమేనని చెప్పాలి.

Next Story