కరోనా మహమ్మారి దేశాలను కుదిపేస్తోంది. ఈ మాయదారి వైరస్‌ వల్ల ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వ్యక్తికి కరోనా సోకిన దగ్గరి నుంచి చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే వరకు సహసంతో కూడిన సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోంది. సాధారణంగా చనిపోయిన వ్యక్తులకు అంత్యక్రియలు నిర్వహించే విధంగా కరోనాతో చనిపోయిన వారికి నిర్వహంచే అవకాశం లేదు. అందుకు కొన్ని పద్దతులు పాటించాల్సి ఉంటుంది. ఐసోలేషన్‌ వార్డు నుంచి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. వీటిని తప్పకుండా పాటించాలని సూచించింది. ఐసోలేషన్‌ వార్డులు, మార్చురీ, అంబులెన్స్‌, శ్మశాన వాటికలో విధులు నిర్వహించే వారు ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటారు.

వైద్య సిబ్బంది శుభ్రత పాటించడం తప్పనిసరి. వ్యక్తిగత రక్షణ పరికరాలు వినియోగించాలి. ఆప్రాన్‌, మాస్కు, గ్లౌజ్‌లు, కళ్లజోడు ఇలాంటివి తప్పనిసరి. రోగి వాడిన బట్టలు, ఇతర వస్తువులను హైపోక్లోరైట్‌ ద్రావణంతో శుభ్రం చేయాల్సి ఉంటుంది. బయోమెడికల్‌ వేస్ట్‌ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇక్కడ శవ పరీక్షలు నిర్వహించరాదనే నిబంధన కూడా ఉంది.

రెడ్‌ బాడీకి ప్రత్యేక ప్లాస్టిక్‌ బ్యాగు

కరోనా రోగి చనిపోయిన తర్వాత మృతదేహం కోసం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాగులో ఉంచాలి. బ్యాగు వెలుపలి భాగాన్ని ఒక శాతం హైపో క్లోరైట్‌తో శుభ్రం చేయాలి. ఇక రెడ్‌ మృతదేహాన్ని తరలించే వాహనాన్ని ఒక శాతం సోడియం హైపో క్లోరైట్‌ ద్రావణంతో శుభ్రం చేయాలి. శవం ఉంచిన బ్యాగ్‌ జిప్‌ను ముఖం వరకు తెరిచి ఉంచాలి. ఇక కుటుంబీకులకు, బంధువులకు కడసారి చూసేందుకు అనుమతి ఇస్తారు. రెడ్‌ బాడీ తరలించే వాహనాన్ని కూడా ఒక శాతం సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణంతో శుభ్రం చేస్తారు. శరీరాన్ని తాకవద్దు. అలాగే మతపరమైన ప్రార్థనలకు ఎలాంటి అనుమతి ఉండదు. మృతదేహానికి స్నానం చేయించడం, ముట్టుకోవడం లాంటిది చేయరాదు.

శ్మశాన వాటికలో ఉండే సిబ్బందితో పాటు బంధువులు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అంతే కాదు సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. ఎక్కువ మంది గుమిగూడకూడదు. ఐసోలేషన్‌ వార్డు నుంచి ముందు రోగి కుటుంబ సభ్యులు చూడాలని అనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

అలాగే ఐసోలేషన్‌ ప్రాంతంలో ఉన్న అన్నీ వస్తువులను హైపోక్లోరైట్‌ ద్రావణంతో శుభ్రం చేయాలి. డెడ్‌బాడీని సుమారు 4 డిగ్రీల సెంటిగ్రేట్‌ వద్ద కోల్డ్‌ చాంబర్‌లో ఉంచాలి. మృతదేహానికి ఎంబామింగ్‌కు అనుమతి ఉండదు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.