అమెరికా ప్రజలను ముంచేయబోతున్నారా.. వ్యాక్సిన్ విషయంలో ట్రంప్ తాజా తీరు వివాదాస్పదం..!

By సుభాష్  Published on  2 Sep 2020 10:21 AM GMT
అమెరికా ప్రజలను ముంచేయబోతున్నారా.. వ్యాక్సిన్ విషయంలో ట్రంప్ తాజా తీరు వివాదాస్పదం..!

వ్యాక్సిన్.. ప్రపంచ దేశాలన్నీ ఎప్పుడు ప్రభావంతమైన వ్యాక్సిన్ వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నాయి. ఏ దేశంలో వ్యాక్సిన్ సక్సెస్ అయినా కూడా ఇతర దేశాలతో కలిసి పంచుకోవాలని పలు దేశాలు భావిస్తూ ఉన్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్ తయారీ సంస్థలతో పలు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. అమెరికాలో కూడా మూడు-నాలుగు సంస్థలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తాము వ్యాక్సిన్ ను అతి త్వరలో తీసుకుని వస్తున్నామని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తయారీలోనూ, పంపిణీ విషయంలోనూ ఇంతకు ముందు ప్రపంచ దేశాలతో కలిసి నడుస్తామంటూ ట్రంప్ తెలిపాడు. కానీ ఎందుకో ట్రంప్ సర్కారు తాజాగా ఆ విషయంలో యుటర్న్ తీసుకుంది. టీకా అభివృద్ధి, పంపిణీ విషయంలో తామెవరితోనూ కలిసి నడవబోమని, తమను తాము నిర్బంధించుకోదలచుకోలేదని చెప్పడమే కాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)పైనా తీవ్ర ఆరోపణలు చేసింది.

టీకా అభివృద్ధి, దాని పంపిణీ విషయంలో డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలో 150 దేశాలు కొవాక్స్ పేరిట ఓ కూటమిగా ఏర్పడ్డాయి. ఏ టీకా అయితే కరోనాపై సమర్థంగా పనిచేస్తుందో దాని నుంచి వీలైనంత త్వరగా లబ్ధిపొందాలని.. ఎక్కువ సంఖ్యలో టీకాలను తయారు చేసి అందరికీ పంచేస్తే ఈ మహమ్మారి నుండి గట్టెక్కవచ్చని డబ్ల్యూహెచ్ఓ ఉద్దేశ్యం. ఈ ఒప్పందం వల్ల అందరికీ ప్రయోజనం కలుగుతుంది.. కానీ ట్రంప్ ప్రభుత్వం మాత్రం వీటితో కలవకుండా ఒంటరిగానే వెళ్లాలని నిర్ణయించుకుంది.

కోవిద్-19 ప్రబలినప్పటి నుండి అమెరికా చైనా మీద తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉంది. అమెరికా డబ్ల్యూహెచ్ఓకు ఇచ్చే నిధులలో కూడా కోత విధిస్తున్నామని తెలిపిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి వ్యాప్తికి చైనాతోపాటు డబ్ల్యూహెచ్ఓ కూడా కారణమైందని తీవ్ర ఆరోపణలు చేసింది.

ఇతర దేశాలతో కలవకుండా ఒంటరిగా వెళ్లాలని అనుకున్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు. కోవాక్స్‌లో చేరడం ద్వారా ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించే భరోసా ఏర్పడుతుందని పలువురు అమెరికా నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు కూడా సామాజిక మాధ్యమాల్లో ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు.

Next Story