లక్షణం లేకుంటే 'టెస్టు' అక్కర్లేదన్నందుకు అమెరికాలో ఏం జరిగిందంటే?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Sep 2020 1:16 AM GMT
లక్షణం లేకుంటే టెస్టు అక్కర్లేదన్నందుకు అమెరికాలో ఏం జరిగిందంటే?

తెలంగాణ రాష్ట్రంలో కరోనాకు సంబంధించి.. దాని బారిన వారికి సంబంధించి ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవాలంటే.. ఇట్టే తీసేసుకోవటం.. గంటల వ్యవధిలో దాన్ని అమల్లోకి తెచ్చేస్తుంటారు. కరోనా కేసులు నమోదైన మొదట్లో.. కంటైన్మెంట్ కేంద్రాల మీదా.. పరీక్షల మీదా తెలంగాణ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో తెలిసిందే. ఎవరైనా ఒకరికి పాజిటివ్ గా తేలిన వెంటనే.. వారి ఎవరెవరి కాంటాక్టు అయ్యారో చెక్ చేసి మరీ టెస్టులు చేసేవారు. ఇక.. వారి కుటుంబ సభ్యులకు తప్పనిసరిగా టెస్టులు చేసేవారు.

కేసులు పెరుగుతున్న కొద్దీ.. కాంటాక్టుల మీద ఫోకస్ తగ్గించి.. ఇంట్లో వారికి.. వారికి దగ్గరగా ఉండేవారికి పరీక్షలు చేసేవారు. మరిన్ని కేసులు పెరిగిన తర్వాత.. ఇంట్లో వారికే పరిమితం చేశారు. ఆ తర్వాత ఇంట్లో వారికి కూడా.. లక్షణాలు ఉంటేనే పరీక్షలు అవసరమన్న మాట కూడా కొన్నిచోట్ల వినిపిస్తోంది. టెస్టుల విషయంలో ఇలా ఉంటే.. కంటైన్మెంట్ కేంద్రాల విషయంలో తొలుత బజారు మొత్తం.. తర్వాత వీధి మొత్తం.. ఆ తర్వాత పాజిటివ్ వచ్చిన ఇంటి రెండు.. మూడు ఇళ్లకు.. చివరగా.. ఆ ఇంటిని మాత్రమే కంటైన్మెంట్ కేంద్రాలుగా మార్చేయటం తెలిసిందే.

రెండో దఫా వచ్చేనా.. కరోనా..?

మన దగ్గర.. నిర్ణయాలు సింఫుల్ గా తీసేసుకోవటమే కాదు.. అవి అమల్లోకి వచ్చాయన్న విషయం మీద కూడా అవగాహన తెచ్చే ప్రయత్నం చేయరు. ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తే మాత్రమే విషయాలు తెలుస్తుంటాయి. మరి.. అమెరికాలో ఏం జరుగుతుందో చూద్దాం. అక్కడ వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రాలు (సింపుల్ గా చెప్పాలంటే సీడీసీ) ఇటీవల ఒక నిర్ణయాన్ని తీసుకుంది. దాని ప్రకారం.. కరోనా సోకిన వారికి దగ్గరగా మెలిగిన వ్యక్తులకు లక్షణాలు లేకుంటే కోవిడ్ టెస్టు అవసరం లేదని తేల్చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాల్ని రూపొందించింది.

ఈ నిర్ణయంపైన అమెరికాలోని అత్యధిక రాష్ట్రాల గవర్నర్లు వ్యతిరేకిస్తున్నాయి. వారి వాదన ప్రకారం ఎవరైనా ఒకరు కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత వారి కుటుంబ సభ్యులు.. సన్నిహితంగా మెలిగిన వారు.. అనుమానం ఉన్న వారందరికి పరీక్షలు చేయాలంటున్నారు. దీనికి భిన్నంగా సీడీసీ మాత్రం పరీక్షల్ని వీలైనంత తక్కువ చేయాలన్నట్లుగా వ్యవహరించటాన్ని అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు బలంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఇదిక్కడితో ఆగలేదు. న్యూయార్క్.. కనెక్టికట్.. న్యూజెర్సీ గవర్నర్లు అయితే సీడీసీ ప్రకటనను వ్యతిరేకిస్తూ సంయుక్త ప్రకటన చేశారు. ఎలాంటి శాస్త్రీయత లేకుండా మార్గదర్శకాల్ని మార్చటం సీడీసీ కీర్తిని దెబ్బ తీస్తుందని పేర్కొన్నారు. గడిచిన కొద్ది రోజులుగా అమెరికాలో రోజువారీగా చేస్తున్న టెస్టుల సంఖ్య తగ్గిపోతున్న వైనంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గత నెలలో రోజూ ఎనిమిది లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తుంటే.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ఆరున్నర లక్షలకే పరిమితం చేయటంపై ఆందోన వ్యక్తమవుతోంది. విధానపరమైన నిర్ణయాలపై అర్థవంతంగా చర్చ జరగటమో.. బాహాటంగా వ్యతిరేకించటం లాంటివి అమెరికాలో జరిగితే.. మన దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం కదా.

Next Story