అమెరికాలో 69 మంది, సౌదీలో 11 మంది భారతీయులు మృతి
By సుభాష్ Published on 25 April 2020 10:07 AM ISTకరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి దాదాపు 200లకుపైగా దేశాలకు చాపకింద నీరులా విస్తరించింది. ఈ మహమ్మారికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. అన్ని దేశాలను పట్టిపీడిస్తోంది. ఇక ఆగ్రరాజ్యం అమెరికా ఉక్కిరిబిక్కిరవుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నా.. మృత్యుఘోష మాత్రం తప్పడం లేదు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 2,708,885 కరోనా కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 190,858 మంది మృతి చెందారు. ఇక కోలుకున్న వారి సంఖ్య 738,489 మంది ఉండగా, ప్రస్తుతం 1,789,546 ఉన్నారు.
ఇక అమెరికాలో మాత్రం పాజిటివ్ కేసుల సంఖ్య, మృతుల సంఖ్య మాత్రం కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకూ 925,358 కేసులు మోదు కాగా, 52,296 మంది మరణించారు. కాగా, కరోనా బారిన అమెరికాలో ఉంటున్న భారతీయులు, భారత సంతతికి చెందిన వారిలో సుమారు 69 మంది మృతి చెందినట్లు సమాచారం.
ఇక న్యూజెర్సీలో ఉంటున్న 400పైగా మంది భారతీయులకు కరోనా పాజిటివ్ తేలింది. అమెరికాలో ఉంటున్న వెయ్యి మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు భారతీయ సంఘాల నాయకులు చెబుతున్నారు.
అమెరికాలో వైరస్ సోకిన తర్వాత ప్రతి రోజు దాదాపు వెయ్యి మంది వరకు మృత్యువాత పడగా, ఏప్రిల్ 7వ తేదీ తర్వాత ప్రతి రోజు దాదాపు 2వేల వరకూ మృత్యువాత పడుతున్నారు. సాంకేతికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన అమెరికా సైతం కరోనాను ఏమి చేయలేకపోతోంది. కరోనాను ఎలాంటి సమయంలోనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధ్యక్షుడు ట్రంప్ మాటలు తలకిందులయ్యాయి. గంటగంటకు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన పడిపోతోంది అమెరికా.
సౌదీలో 11 మంది..
ఇక సౌదీ ఆరేబియాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అక్కడ 11 మంది భారతీయులు కరోనాతో మృతి చెందినట్లు సౌదీలోని ఇండియన్ ఎంబసీ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 22వ తేదీ వరకూ మాత్రమే ఈ మరణాలు నమోదయ్యాయి. మదీనాలో నలుగురు, జెడ్డాలో ఇద్దరు, మక్కాలో ముగ్గురు, రియాద్‌లో దమ్మమ్‌లో ఒకరు చొప్పున మరణించారని తెలిపింది. సౌదీలో ఇప్పటి వరకూ 13,930 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
సౌదీ నుంచి భారత్‌కు విమాన సర్వీసుల రద్దు
కాగా, కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత్‌కు విమనాల సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పట్లో విమాన సర్వీసుల నిషేధం ఎత్తివేయలేమని అక్కడి అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సౌదీ ఆరేబియాలో ఉన్న భారతీయులను తరలించే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.