చంద్రబాబు లాంటి యూటర్న్‌ రాజకీయవేత్త దేశంలోనే లేరు

By అంజి  Published on  28 Jan 2020 10:37 AM GMT
చంద్రబాబు లాంటి యూటర్న్‌ రాజకీయవేత్త దేశంలోనే లేరు

అమరావతి: కౌన్సిల్‌ రద్దు చేయాలన్న కీలక నిర్ణయాన్ని సుధీర్ఘ చర్చ తర్వాత అసెంబ్లీ ఆమోదించడం జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శాసన మండలి రద్దు ఒక చారిత్రాత్మక నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. 1983లో ఎన్టీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్నే ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్నరాని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో మండలి లేకుండానే పరిపాలన సాగుతోందని తెలిపారు. కీలక నిర్ణయాన్ని తీసుకునే సమయంలో చంద్రబాబు అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయోరో అంటూ విమర్శలు చేశారు.

చంద్రబాబు తన అభిప్రాయాన్ని అసెంబ్లీలో చెప్పేందుకు ఎందుకు వెనకాడారు అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. పరిమితులకు లోబడి పనిచేయాల్సిన శాసనమండలిని దానికి విరుద్ధంగా పనిచేసేలా చంద్రబాబు ఓవరాక్షన్‌ చేశారని, వెన్నుపోటు రాజకీయంలో చంద్రబాబుకు మించినవారు లేరని అంబటి అన్నారు. ఎనిమిది నెలల క్రితం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై చంద్రబాబు పిచ్చి సవాళ్లు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యం చంద్రబాబుకు అసలు గౌరవం ఉందా అంటూ అంబటి ప్రశ్నించారు. చంద్రబాబుకు అంత ఉబలాటంగా ఉంటే 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు. చంద్రబాబు లాంటి యూటర్న్‌ రాజకీయవేత్త దేశంలోనే లేరని ప్రజలంటున్నారని ఎమ్మెల్యే అంబటి చెప్పుకొచ్చారు.

రాజకీయాల కోసం చంద్రబాబు ఎన్నో చేయకూడని తప్పులు చేశారని, కుమారుడి కోసం ఎన్టీఆర్‌ కుటుంబాన్ని నాశనం చేశారన్నారు. రాజకీయం కోసం సొంత తమ్ముడినే నాశనం చేసిన చంద్రబాబుకు సీఎం వైఎస్‌ జగన్‌పై చౌకబారు విమర్శలు చేసే అర్హత లేదన్నారు. ఏం చెప్పినా చూపించే ఛానళ్లు ఉన్నాయని, సీఎం వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు దిగజారుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు శాసనమండలిపై గతంలో ఏమన్నారు, ఇప్పుడు ఏమన్నారనేది ఆ ఛానళ్లు, పత్రికలు ఎందుకు చూపించడం లేదంటూ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు.

Next Story