అమరావతిలో ఆగని నిరసనలు

By Newsmeter.Network  Published on  24 Dec 2019 7:14 AM GMT
అమరావతిలో ఆగని నిరసనలు

ముఖ్యాంశాలు

  • మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ రైతుల నిరసనలు
  • తుళ్లూరులో నల్ల దుస్తులు ధరించి రైతుల ధర్నా
  • మందడం ప్రధాన రహదారిపై రైతుల ఆందోళన
  • అచ్చంపేట-సత్తనపల్లి రోడ్డుపై అర్థనగ్నంగా రైతుల బైఠాయింపు

అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. అమరావతిలో రైతుల నిరసనలు ఏడో రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరులో రైతులు నల్ల దుస్తులు ధరించి ధర్నా చేస్తున్నారు. తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించడం లేదని మహిళలు ఫిర్యాదు చేశారు. రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నా ఎమ్మెల్యే స్పందించం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కనిపించడం లేదని, వెతికి పెట్టాలని రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రాజధానుల ప్రకటనపై తాము ఏదైన చెప్పుకొందామంటే మా ఎమ్మెల్యే ఎక్కడున్నారో కనిపించడం లేదని వారు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మా ఎమ్మెల్యే కనిపించకపోవడంపై ఎంతో ఆందోళనలోఉన్నాం.. మా ఎమ్మెల్యేను మాకు అప్పగించండి అంటూ రైతులు చెప్పుకొచ్చారు.

మందడం ప్రధాన రహదారిపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. అచ్చంపేట-సత్తెన్నపల్లి రోడ్డుపై రైతులు అర్ధనగ్నంగా భైఠాయించారు. ఇసుక, ఉల్లిపాయలతో రైతుల వినూత్న నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో సచివాలయం వెళ్లే రహదారిపై భారీగా పోలీసుల మోహరించారు. అమరావతి ప్రాంతంలో నిరసనలు ఆగడం లేదు. నిరసనలకు వేదికగా తుళ్లూరులో టెంట్‌ వేసి రైతులు నిరసన తెలియజేస్తున్నారు. అనుమతులు లేవంటూ పోలీసులు టెంట్‌ పీకేశారు. తుళ్లూరు, మందడంలో రైతులు మహాధర్నాలు చేస్తున్నారు.

రాజధానితో పాటు హైకోర్టును కూడా అమరావతిలో కొనసాగించాలని విజయవాడ లాయర్లు డిమాండ్‌ చేస్తున్నారు. అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉండడం వల్ల రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఉంటుందన్నారు. సొంత కారణాల వల్ల వైసీపీ ప్రభుత్వం అమరావతిని మూడు ముక్కలు చేయడం భావ్యం కాదని లాయర్లు అంటున్నారు. న్యాయవాదులకు దేవినేని ఉమా, బోండా ఉమా మద్దుతు తెలిపారు. ఈ నెల 27న విశాఖలో కేబినెట్‌ సమావేశం పెట్టడం ఏంటన్నారు. కేబినెట్‌ భేటీ అనేది సచివాలయంలో పెట్టుకుంటారని.. రైతులకు జవాబు చెప్పలేక సీఎం విశాఖ పారిపోతున్నారని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు.

రాజధాని అమరావతి రైతుల ఆందోళనకు గంటా శ్రీనివాసరావు మద్దతు పలికారు. రాజధాని రైతులకు ఎలా న్యాయం చేస్తారో ప్రభుత్వం చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. వ్యక్తిగతంగా విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ను స్వాగతిస్తున్నాని పేర్కొన్నారు. విశాఖ ప్రాంతానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను రాజధాని ప్రాంత రైతులు కలిసారు. రాజధాని తరలింపును అడ్డుకోవాలని కన్నాను కోరారు. ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుతుందనే.. వింత వైఖరిని తెరపైకి తెచ్చారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఇలాంటి సరికావని.. ప్రజలు భయంతో బతకాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయన్నారు. జగన్‌ పాలనలో కక్ష సాధింపు ధోరణి కనపడుతోందన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు.

Next Story