కడపలో సీఎం జగన్‌ రెండో రోజు పర్యటన

By Newsmeter.Network  Published on  24 Dec 2019 3:25 AM GMT
కడపలో సీఎం జగన్‌ రెండో రోజు పర్యటన

కడప: సీఎం వైఎస్‌ జగన్ రెండో రోజు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి జగన్‌ నివాళులర్పించనున్నారు. అనంతరం చర్చిలో ప్రార్థనలు చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు రాయచోటిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పులివెందులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. రాయచోటిలో రూ.12,72 కోట్లతో ఎత్తిపోతల పథకం ద్వారా హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి సుజల స్రవంతి అనుసంధాన పథకాన్ని ప్రారంభించనున్నారు.

పట్టణంలోని జూనియర్‌ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగిస్తారు. రాత్రి పులివెందులలోనే సీఎం జగన్‌ బస చేస్తారు. రేపు పులివెందులలో రూ.347 కోట్లతో నిర్మించనున్న మెడికల్‌ కాలేజీ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సొంత జిల్లా అయిన కడపలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సీఎం జగన్‌ పర్యటనపై కడప జిల్లా వాసులు, వైసీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నిన్న జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఏటా 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టనున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ద్వారా ప్రత్యేక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభించనుంది. స్టీల్ ప్లాంట్‌ కోసం గండికోట రిజర్వాయర్‌ నుంచి రెండు టీఎంసీల నీటి సరఫరా చేయనున్నారు. ప్లాంట్‌ నిర్మాణం కోసం ఇప్పటికే 3,200 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ఎన్‌ఆర్సీపై వ్యాఖ్యలు చేశారు. మైనార్టీలకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మైనార్టీల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై డిప్యూటీ సీఎం అంజాద్‌ తనతో చర్చించిన తర్వాతే ఇటీవల ప్రకటన చేశారని పేర్కొన్నారు. తామంతా ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

Next Story
Share it