హైటెన్షన్‌.. అమరావతి భవితపై కీలక నిర్ణయం

By అంజి  Published on  20 Jan 2020 3:34 AM GMT
హైటెన్షన్‌.. అమరావతి భవితపై కీలక నిర్ణయం

అమరావతి: అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. అమరావతిలో దాదాపు 2,500 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. కాగా రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళనలు ఉధృతమయ్యాయి. అయితే అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఇవాళ ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు నిలిపివేశారు. బ్యారేజ్‌పై హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ ఉద్యోగులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. కాగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. అసెంబ్లీని ముట్టడించి తీరుతామని టీడీపీ, జేఏసీ నేతలు తెలిపారు. అసెంబ్లీ ముట్టడికి యత్నించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు.

ఈ నెల 23 వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయన్నారు. అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని గ్రామాల్లో 5 వేల మంది పోలీసులు పహారాలో ఉన్నారు. అమరావతి పూర్తిగా పోలీసుల భద్రతా వలయంలో ఉంది. గుంటూరులో విద్యార్థి జేఏసీ ఆందోళనలకు దిగింది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. బృందావన్‌ గార్డెన్స్‌ దగ్గర విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి జేఏసీ నేతలను అరెస్ట్‌ చేసి పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

అమరావతి భవితపై ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇవాళ్లి నుంచి ఏపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అంతకుముందు ఏపీ కేబినెట్‌ సమావేశం కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, వికేంద్రీకరణ, హైపవర్‌ కమిటీ నివేదికపై చర్చించనున్నారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో బీఏసీ సమావేశం జరగనుంది. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశాలున్నాయి. పాలనా వికేంద్రీకరణ చేస్తున్నట్లు ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనుంది.

Next Story