వైసీపీలో కరణం చేరికపై ఆమంచి ఏమన్నారంటే..
By న్యూస్‌మీటర్ తెలుగు
ఆమంచి కృష్ణమోహన్.. ప్రకాశం జిల్లా రాజకీయాలకు పరిచయంం అక్కర్లేని పేరు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమంచికి ప్రత్యేక గుర్తింపు వుంది. 2014-15 అసెంబ్లీ ఎన్నికలలో చీరాల నుండి టీడీపీ అభ్యర్ధిగా గెలిచి.. అనంతరం 2019 ఎన్నికలకు ముందు టీడీపీ అధినాయకత్వం మీద తన వ్యతిరేకతను వెళ్లగక్కుతూ వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన ఆమంచికి జగన్ కూడా చీరాల టికెట్‌ను ఇచ్చారు. అయితే.. అనూహ్యంగా ఆమంచి ఆ ఎన్నికలలో కరణం బలరాంపై ఓడిపోయారు.
అయితే.. తనపై గెలిచిన కరణం బలరాం ఇప్పుడు.. వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ విషయమై ఆమంచి మాట్లాడుతూ.. టీడీపీ రాజకీయ పార్టీ కాదని.. అదొక అక్రమ వ్యాపార సంస్థని విమర్శించారు. టీడీపీ విధివిధానాలు నచ్చకనే గతంలో నేను టీడీపీని వీడి వైసీపీలో చేరానని అన్నారు. వైసీపీలో, టీడీపీలా గ్రూపులు కట్టే చాన్స్ లేదని.. జగన్ నన్ను దెబ్బతీసేందుకు పార్టీలోకి ఎవరిని తీసుకోరని అన్నారు. నేను ఉన్న పార్టీలోకే సునీత, బలరాం వస్తున్నారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం పార్టీ మారేందుకు.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 4 కోట్ల నుంచి రూ. 40 కోట్ల వరకూ ఇచ్చారని ఆరోపించారు.