టీడీపీకి భారీ షాక్.. వైసీపీలో చేరిన కరణం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 March 2020 12:38 PM GMT
స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రకాశం జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తేదేపాను వీడి వైసీపీలో చేరారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన సీఎం క్యాంపు కార్యలయంలో జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన కుమారుడు కరణం వెంకటేష్, మాజీ మంత్రి పాలేటి రామారావులతో పాటుగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ ఉదయం చీరాల నుండి భారీగా అనుచరవర్గంతో కరణం తాడేపల్లి చేరుకోవడంతో.. సీఎం క్యాంపు కార్యాలయ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. కరణం చేరికతో చీరాలలో టీడీపీకి భారీ నష్టం వాటిల్లనుంది. ఇదిలావుంటే.. ఎన్నికల ముందు టీడీపీ నుండి వైసీపీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్.. కరణం చేరికపై ఎలా స్పంధిస్తారో చూడాలి మరి.
ఈ సందర్భంగా కరణం వెంకటేష్ మాట్లడుతూ.. చీరాల నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలతో కలిసి ఇవాళ వైసీపీలో చేరాను. మాజీమంత్రి పాలేటి రామారావుతో పాటు మిగిలిన నేతలందరూ మాతో ఉన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనను అందరూ మెచ్చుకుంటున్నారు. అందుకే మేం కూడా చీరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేదానికి, మంత్రి బాలినేని శ్రీనివాసరావు సమక్షంలో వైసీపీలో చేరాం. ప్రకాశం జిల్లాతో పాటు చీరాల నియోజకవర్గంలో వైసీపీని బలోపేతం చేయడానికి అందరూ కలిసి పనిచేస్తాం. చీరాల ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా పనిచేస్తూ.. 2024లో కూడా వైసీపీని అధికారంలోకి తెచ్చే విధంగా కృషి చేస్తామన్నారు.