రాత్రి 10 గంటల వరకు షాపులు తెరుచుకోవచ్చు
By సుభాష్ Published on 21 Oct 2020 1:01 PM GMTతమిళనాడులో షాపింగ్ మాల్స్, దుకాణాలు, రెస్టారెంట్లు ఇతర వ్యాపార సముదాయాలు రాత్రి పది గంటల వరకు తెరిచే ఉంటాయి. రాత్రి పది గంటల వరకు వ్యాపారం చేసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రేపటి నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అయితే క రోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మార్చి 23న దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా లాక్‌డౌన్‌ను సడలిస్తూ వచ్చింది.
ప్రస్తుతం దేశంలో అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలలో అన్ని రకాల వ్యాపార సముదాయాలను రాత్రి పది గంటల వరకు తెరుచుకోవచ్చని తెలిపింది. అయితే ఈ సడలింపుల నిర్ణయాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది కేంద్ర సర్కార్. ఇందులో భాగంగానే తమిళనాడులో కరోనా వైరస్ ఎక్కువగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం షాపింగ్ మాల్స్‌కు రాత్రి పది గంటల వరకు తెరిచి ఉంచుకునేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఇప్పుడు కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడంతో వ్యాపారస్తులు రాత్రి పది గంటల వరకు వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది.