అమెజాన్‌ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

By సుభాష్  Published on  21 Oct 2020 8:48 AM GMT
అమెజాన్‌ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

ఈ-కామర్స్‌ సంస్థ అయిన అమెజాన్‌ తన ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. కోవిడ్‌, లాక్‌డౌన్‌ నిబంధనలతో టెక్‌ సంస్థలు, కార్పొరేట్‌ దిగ్గజాలు, సామాన్య సంస్థల వరకు వర్క్‌ ఫ్రం హోం విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గూగుల్‌, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌, ఫేస్‌ బుక్‌ తదితర సంస్థలు తమ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసుకునేందుకు అనుమతిచ్చాయి. వచ్చే ఏడాది జనవరి వరకు ఇంటి నుంచే పనులు చేసుకోవచ్చని అమెజాన్‌ తాజాగా వెల్లడించింది.

కాగా, 2021 జూన్‌ 30వ తేదీ వరకు వర్క్‌ఫ్రం హోం చేయగల ఉద్యోగులకు అవకాశాన్ని కల్పిస్తున్నామని అమెజాన్‌ ప్రకటించింది.ఈ మేరకు ఉద్యోగులకు ఈమెయిల్‌ సమాచారం అందించింది. ఈ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఫేస్‌బుక్ వచ్చే సంవత్సరం జులై వరకు, గూగుల్‌ 2021 జూన్‌ వరకు వర్క్‌ ఫ్రం హోంకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అమెజాన్‌ సైతం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

19వేల మంది ఉద్యోగులకు కరోనా

ప్రపంచ వ్యాప్తంగా భయపెడుతున్న కరోనా మహమ్మారి.. ఆన్‌లైన్‌ రిటైలర్‌ అమెరికాలో పని చేస్తున్న దాదాపు 19వేల మంది ఉద్యోగులకు కరోనా సోకింది. గడ్డంగులను తెరిచి ఉండమే వైరస్‌ విస్తరణకు దారి తీసిందంటూ గతంలో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే భౌతిక దూరం, థర్మల్‌ స్క్రీనింగ్‌, ఫేస్‌ మాస్కులు ధరించడం, హ్యాండ్‌ శానిటైజర్లు లాంటి కోవిడ్‌ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నామని ఆమెజాన్‌ ప్రకటించింది.

కాగా, కరోనా నేపథ్యంలో ముందుగా స్పందించి ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశాన్ని కల్పించిన అంతర్జాతీయ సంస్థల్లో ట్విటర్‌ ఒకటనే చెప్పాలి. ఈ సంస్థ మే నుంచి తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేయాలని పేర్కొంది. మైక్రోసాఫ్ట్‌ కూడా తన ఉద్యోగుల్లో అధిక శాతం మందికి శాశ్వతంగా ఇంటి నుంచి పని చేసే సదుపాయాన్ని కల్పించింది. కోవిడ్‌ వ్యాప్తి కారణంగా వర్క్‌ ఫ్రం హోం చేస్తున్న తమ ఉద్యోగులకు మంచి పనితీరు కనబరుస్తున్నట్లు యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ పేర్కొన్నారు. ఇక గూగుల్‌తో పాటు , కోకోకోలా, స్క్వేర్‌ తదితర సంస్థలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి.

Next Story