భారత్ - చైనా ఉద్రిక్తతలు: 19న అఖిలపక్ష సమావేశానికి మోదీ పిలుపు
By సుభాష్
ప్రధాని నరేంద్రమోదీ 19న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. భారత్ -చైనాల మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో 19న సాయంత్రం 5 గంటలకు అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించనున్నారు. కాగా, భారత్-చైనాలో జరిగిన ఘర్షణల వల్ల 20 మంది జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అంతేకాదు చైనాకు చెందిన 45 మంది జవాన్లు కూడా మరణించారని సమాచారం. కానీ చైనా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం కూడా పంపారు. ఈ భేటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా భారత్ -చైనా ఘర్షణలపై చర్చ కొనసాగనుంది.
ఇక దేశ వ్యాప్తంగా చైనా తీరును నిరసిస్తూ ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. పలు ప్రాంతాల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుట్ గాంధీ సైతం విరుచుకుపడ్డారు.