ట్రంప్ టార్గెట్ చేసిన ‘అలెగ్జాండ్రియా’ ఎవరు? ఎందుకు పంచ్ లు వేశారు?
By సుభాష్ Published on 17 July 2020 12:05 PM ISTఅమెరికా అధ్యక్ష స్థానంలో కూర్చున్న వ్యక్తికి ఉండే అపరిమితమైన అధికారాలు అందరికి తెలిసిందే. ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికాకు అధ్యక్షుడంటే మాటలు కాదు. అలాంటి స్థానంలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఉత్త పుణ్యానికే మాట రాదు. ఆ స్థానంలో కూర్చున్న వ్యక్తులు ఎవరినైనా.. ఏదైనా విషయాన్న ప్రస్తావించారంటే.. దానికి బోలెడెన్ని లెక్కలు ఉంటాయి.
తాజాగా వైట్ హోస్ లోని రోజ్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తన ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించే క్రమంలో.. ‘అలెంగ్జాండ్రియా’ అనే యుక్తవయస్కుల్ని ఉద్దేశించి ఆయన చేసిన విమర్శలు.. వ్యంగ్య వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రపంచ దేశాల్లోని పలువురు ఎవరీ అలెగ్జాండ్రియా? అన్న ఆసక్తి వ్యక్తమైంది. ఇప్పటికే ఆమె గురించి.. ఆమె టాలెండ్ ఎంతన్న విషయం తెలిసిన వారు మాత్రం.. ట్రంప్ అనవసరంగా ఆమెతో పెట్టుకున్నారన్న అభిప్రాయంతో ఉన్నారు.
వారి అంచనా నిజమని తేలటమే కాదు.. అమెరికా అధ్యక్షుడికి నోట మాట రాని రీతిలో పంచ్ ఇచ్చిన ఆమె తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరు? ఏం చేస్తుంటారు? ఆమె ప్రస్తావనను తాజాగా ట్రంప్ ఎందుకు తెచ్చారు? అందుకు ఆమె తెలివిగా ఎలాంటి సమాధానంఇచ్చిందన్న విషయాల్లోకి వెళితే..
2018లో జరిగిన మిడ్ టెర్మ్ ఎన్నికల్లో న్యూయార్క్ నుంచి అమెరికా ప్రతినిధులసభకు డెమొక్రాట్ల పక్షాన నిలిచిన ఆమె.. సభలోకి అడుగు పెడుతూనే.. అతి పిన్న వయసులోనే సభకు ఎన్నికైన సభ్యురాలన్న రికార్డును నెలకొల్పారు. సభలోకి అడుగుపెట్టే నాటికి ఆమె వయసు కేవలం 28 ఏళ్లు మాత్రమే. బోస్టన్ వర్సిటీలో బీఏ చదివిన ఆమె.. కాలమిస్ట్ గా.. లెజిస్లేటివ్ అసిస్టెంట్ గా.. సామాజిక కార్యకర్తగా ఇలా మల్టీ టాలెంట్లు ఆమె సొంతం.
డిగ్రీ చదివిన తర్వాత తాను పుట్టిన న్యూయార్కు మహానగరంలోనే బార్ టెండర్ గా.. వెయిట్రెస్ గా పని చేశారు. తల్లికి సాయంగా ఉండేందుకు ఆమె ఇలాంటి చిన్న ఉద్యోగాల్ని చేసేందుకు వెనుకాడలేదు. తల్లి హౌస్ క్లీనర్ గా.. తండ్రి స్కూల్ బస్సు డ్రైవర్ గా పని చేసేవారు. పందొమిదేళ్ల చిరు ప్రాయంలోనే తండ్రిని కోల్పోయిన ఆమె.. ఇంట్లో పెద్ద దిక్కుగా మారారు. తల్లిని.. తమ్ముడ్ని పోషించేందుకు ఆమె మరింతగా కష్టపడాల్సి వచ్చింది.
2016లో ట్రంప్ ఎన్నికల్లో నిలబడే నాటికి ఆమెకు 26ఏళ్లు. ఆ ఏడాది ప్రైమరీ ఎన్నికలకు డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థికి ప్రచార నిర్వాహణ బాధ్యతల్ని నిర్వహించేవారు. ముఖంలో ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే ఆమె.. తనజీవితంలో ఉన్న కష్టాలకు కుంగిపోరు. ఆమె జీవితాన్ని నెట్ ఫ్లిక్స్ వారు డాక్యుమెంటరీ తీయటం గమనార్హం. ‘‘నాక్ డౌన్ ది హౌస్’’ పేరుతో తీసిన ఈ డాక్యుమెంటరీ చూస్తే.. ఆమె జీవితం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది.
తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ.. డెమొక్రాటిక్ అభ్యర్థి బైడన్ తరఫున ఆమె ప్రచార బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. తాజాగా రెండు ట్రిలియన్ డాలర్లు ఖర్చు అయ్యే గ్రీన్ న్యూ డీల్ క్లయిమెట్ పాలసీను తెర మీదకు తీసుకొచ్చారు. అందులో ఆమె పాత్ర కీలకం. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ.. ట్రంప్ కు సైతం దాని సెగ తాకింది. తనను ఇబ్బంది పెట్టే ఈ పాలసీపై తాజాగా ట్రంప్ రియాక్ట్ అయ్యారు.
‘ఆ పాలసీ అర్థం లేనిది. ఆ డీల్ కు ఇన్ ఛార్జిగా పని చేస్తున్న అలెగ్జాండ్రియా అనే యంగ్ ఉమన్ ని తెచ్చి పెట్టుకున్నాడు. జోక్ లా కనిపిస్తుంది.అనేక రకాలుగా ఆమె నాట్ ఏ ట్యాలెంటెడ్’’ అంటూ మండిపడ్డారు.గతంలోనే తనను ఉద్దేశించి విమర్శించినా పట్టించుకోని ఆమె.. ఈసారి తన పేరును ప్రస్తావించటంతో ఆమె రియాక్టు అయ్యారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందిస్తూ.. ‘‘జీవితమంతా తండ్రి డబ్బు మీద ఎదిగిన వ్యక్తి.. ఆర్థిక మోసాలకు పాల్పడిన వ్యక్తి.. 30 ఏళ్లకే యూఎస్ కాంగ్రెస్ లోకి వచ్చిన ఒక హౌస్ క్లీనర్ కూతుర్ని నాట్ ట్యాలెంటెడ్ అంటున్నారు. ఆయన ప్రసంగం వింటే తన మాటల్ని తాను సైతం నమ్మలేకపోతున్న విషయం ట్రంప్ కు కూడా తెలుసు’’ అంటూ పంచ్ ఇచ్చారు. కెలికి పంచ్ ఇప్పించుకోవటంలో ట్రంప్ తర్వాతే ఎవరైనా.