ఇంగ్లాండ్‌ క్రికెటర్‌కు కరోనా..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 March 2020 1:38 PM IST
ఇంగ్లాండ్‌ క్రికెటర్‌కు కరోనా..!

కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్రపంచదేశాలన్నింటిని వణికిస్తోంది. కరోనా వైరస్‌ వల్ల 7వేల మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటికే కరోనా దెబ్బకు పలు క్రీడా టోర్నీలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అన్ని టోర్నీలు వాయిదా పడినా.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) నిన్నటి దాకా నిర్విరామంగా సాగింది. మంగళవారం రెండు సెమీస్‌ మ్యాచ్‌లు, బుధవారం ఫైనల్‌తో ఈ లీగ్‌కు శుభం కార్డు పడాల్సివుంది. అయితే.. కరోనా బారిన ఓ విదేశీ క్రికెటర్‌ పడటంతో లీగ్‌ అర్ధాంతరంగా వాయిదా పడింది.

ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ అలెక్స్‌ హేల్స్‌కు కరోనా వైరస్‌ సోకింది. పరీక్షల్లోనూ పాజిటివ్‌ రావడంతో స్వీయ నిర్భందంలోకి వెళ్లాడని సమాచారం. పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌, కామెంటేటర్‌ రమీజ్‌రాజా సైతం అతడు కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడని తెలిపాడు. కరోనా ముప్పుతో పాకిస్థాన్‌ సూపర్‌లీగ్‌ను సెమీస్‌ దశలోనే వాయిదా వేశారు. ఆటగాళ్లు, బ్రాడ్‌కాస్టింగ్‌ ఉద్యోగులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ రమీజ్‌ రజా మాట్లాడుతూ.. లీగ్‌ మొదలైనప్పటినుంచి ఎలాంటి అనుమానిత కేసులు లేకపోవడంతో సజావుగానే సాగిందని, కానీ 31 ఏళ్ల హేల్స్‌కు కరోనా లక్షణాలు బయటపడటంతో కలకలం రేగిందన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పుడు పీఎస్‌ఎల్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు చేయనున్నామని ఆయన చెప్పారు. పీఎస్‌ఎల్‌లో మొత్తం 34 మంది విదేశీ ఆటగాళ్లు పాల్గొన్నారు. వారంతా కరోనా భయాందోళనలతో ఇదివరకే స్వదేశాలకు చేరారు.

Next Story