షెడ్యూల్‌ ప్రకారమే టీ20 వరల్డ్‌కప్‌..

కరోనా వైరస్‌(కోవిడ్‌-19) ప్రపంచదేశాలన్నింటిని వణికిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి వల్ల 7వేలమందికి పైగా మృత్యువాత పడగా.. లక్షకు పైగా దీని బాధితులు ఉన్నారు. కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. తాజాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. అయితే.. కరోనా భయంతో ఆ టోర్నీ వాయిదా పడుతుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ప్రపంచకప్‌ టోర్నీకి ఆథిత్యమిచ్చే క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ఆ వార్తలపై స్పందించింది.

ఆస్ట్రేలియా గడ్డపై అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఎటువంటి మార్పులు ఉండబోవని సీఏ ప్రకటించింది. అక్టోబర్‌లోపు పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసింది. షెడ్యూల్ ప్రకారమే టీ20 వరల్డ్‌కప్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్‌సన్‌‌కి ఇటీవల కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో అతని నమూనాల్ని పరీక్షించగా.. నెగటివ్ అని తేలిన విషయం తెలిసిందే.

‘కొన్ని వారాల్లోనే మళ్లీ క్రికెట్ సిరీస్‌లు మొదలవుతాయని ఆశిస్తున్నాం. ఇప్పటికే పరిస్థితిని మా నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి.. అక్టోబరు- నవంబరు నాటికి పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే..? షెడ్యూల్ ప్రకారం టీ20 వరల్డ్‌కప్ జరగడం ఖాయం. మెల్‌బోర్న్ వేదికగా నవంబరు 15న టోర్నీ ఫైనల్ జరగనుండగా.. ఆ మ్యాచ్‌కి స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోయేలా ప్లాన్ చేస్తున్నాం’అని సీఏ చీఫ్ కెవిన్ రాబర్ట్స్ వెల్లడించాడు.

Vamshi Kumar Thota

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *