అక్కన్నపేట కాల్పుల్లో కొత్త కోణాలు.. ట్రిగ్గర్, బుల్లెట్లు పాడవకుండా కొబ్బరి నూనెతో..
By అంజి
సిద్దిపేట: అక్కన్నపేట కాల్పుల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2016లో హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌లో దొంగతనం చేసిన ఏకే-47 తుపాకీని సదానందం ఇన్ని రోజులు ఏలా మెయింటెన్ చేశాడన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సదానందకు ఆయుధాలంటే పిచ్చి అని.. ఆ పిచ్చితోనే పోలీస్‌స్టేషన్ తుపాకీని దొంగిలించాడని విశ్వసనీయ సమాచారం. ఏకే-47ను దొంగిలించిన తర్వాత.. దానిని ఇంట్లోనే దాచి పెట్టాడు. రోజు దానిని చూస్తూ మురిసిపోయేవాడు. దానికి సంబంధించిన వీడియోలను సినిమాల్లో, యూట్యూబ్‌లో చూసేవాడు. యూట్యూబ్‌లోని వీడియోలా ద్వారానే తుపాకీని ఎలా వాడాలి, ఎలా ఫైర్ చేయాలన్నది నేర్చుకున్నాడు. తుపాకీ పాడవకుండా రోజు కొబ్బంది నూనెతో తుడిచేవాడు.
తెలంగాణ జిల్లాల పునర్విభజనకు ముందే సదానందం ఏకే-47ను చోరీ చేశాడు. తన పాత కేసుల విచారణలో భాగంగా సదానందం హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వస్తూ వెళ్లేవాడు. అయితే అదే సమయంలో అక్కడ ఉన్న ఆయుధాలు సదానందం దృష్టిని ఆకర్షించాయి. దీంతో ఏకే-47ను, కార్బైడ్‌లను అపహరించాడు. గతంలో హుస్నాబాద్ కరీంనగర్ జిల్లాలో ఉండేది. ఆ తర్వాత జిల్లాల విభజన నేపథ్యంలో హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్.. సిద్దిపేట జిల్లాలోని పోలీస్‌కమిషనరేట్ పరిధిలోకి వెళ్లింది. ఆయుధం చోరీ విషయాన్ని పోలీసులు దాచిపెట్టడంతో ఇన్ని రోజులు ఈ విషయం వెలుగులోకి రాలేదు. 2016 డిసెంబర్‌లో ఆయుధాలను లెక్కచూపే క్రమంలో ఏకే-47 మిస్సింగ్ విషయం తెరమీదకు వచ్చింది. దీంతో అప్పటి హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ సీఐ, గన్‌మెన్‌లపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. తాజాగా అక్కన్నపేట కాల్పుల్లో నేపథ్యంలో 9ఎంఎం కార్బన్ గన్ కూడా మిస్సింగ్ అయ్యిందని తెలిసింది.
అప్పటి హుస్నాబాద్ సీఐ భూమయ్య, సీఐ శ్రీనివాస్‌లో హయాంలోనే తుపాకీ పోయిందన్న విషయంపై సృష్టత కరువైంది. స్టేషన్ నుంచి ఏకే-47 తుపాకీని ఎత్తుకెళ్తుంటే గుర్తించలేదా?, స్టేషన్‌లో సీసీ కెమెరాలు లేవా?, సంబంధిత గన్‌మెన్ ఏం చేశాడు? అన్న ప్రశ్నలపై పోలీసుల నుంచి ఎలాంటి సమాధానాలు లేవు. పోలీసులు తుపాకీ కనిపించకపోతే వెంటనే సమీపంలోని పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేయాలి. తర్వాత రాష్ట్ర పోలీసులు వెంటనే ఆ సమాచారాన్ని రేడియో ద్వారా దేశంలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు పంపుతారు. దీనిపై విచారణాధికారిగా స్థానిక ఎస్పీ లేదా డీఎస్పీ స్థాయి అధికారిని నియమిస్తారు. అయితే ఇక్కడ అంత పెద్ద మారణాయుధం పోయినా.. అధికారులు మాత్రం తూతూమంత్రంగానే వ్యవహరించారు.
అక్కన్నపేటలో ప్రహరీగోడ విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం చోటు చేసుకుంది. సదానందం అనే వ్యక్తి గంగరాజు అనే వ్యక్తి ఇంట్లోకి ఏకే-47తో కాల్పులు జరపడం కలకలం రేపింది.