అఖిలప్రియ ఎందుకిలా ఆవేదన చెందుతున్నారు?

By Medi Samrat  Published on  26 Oct 2019 1:27 PM GMT
అఖిలప్రియ ఎందుకిలా ఆవేదన చెందుతున్నారు?

తన భర్త భార్గవ్ రామ్ పై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని మాజీమంత్రి భూమా అఖిలప్రియ తప్పు పడుతున్నారు. నిజానికి ఈనెల 1వ తేదీన అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పై కేసు నమోదు అయింది. ఒక క్వారీ విషయంలో తలెత్తిన వివాదంలో భార్గవ్ రామ్ పై కేసు నమోదయింది. నిజానికి ఇందులో పెద్దగా భయపడాల్సిన పనిలేదు. తనకు బెయిల్ వచ్చిందని భార్గవ్ రామ్ చెబుతున్నారు. అయితే పోలీసులు భార్గవ్ రామ్ ను అరెస్ట్ చేయడానికి వస్తే ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నట్లు? అఖిలప్రియ ఎందుకు మీడియా ముందుకు వచ్చి రాజకీయ ప్రేరేపిత కేసు అనిచెబుతున్నారు?

అప్పటి నుంచే….

నిజానికి అఖిలప్రియకు వివాహం తర్వాత నుంచే కష్టాలు మొదలయ్యాయంటారు. ఆమె వివాహం భూమా కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేదని చెబుతారు. అయినా పట్టుబట్టి అఖిలప్రియ వివాహం చేసుకోవడం వల్లనే భూమా ఫ్యామిలీలో విభేదాలు మొదలయ్యాయంటారు. ఇందుకు ఉదాహరణలుగా కూడా చెప్పుకోవచ్చు. భూమా నాగిరెడ్డి సోదరుడు కుమారుడైన భూమా కిశోర్ రెడ్డి ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో చేరిపోయారు. ఒకవైపు సోదరి మంత్రిగా పనిచేసి ఆళ్లగడ్డలో ఓటమి పాలయిన తరుణంతో కిశోర్ పార్టీ మారడం వెనక కుటుంబ కలహాలే అని బాహాటంగా చెప్పారు.

వారసత్వం విషయంలోనూ….

మరోవిషయం భూమా నాగిరెడ్డి అసలైన వారసులెవ్వరన్న ప్రశ్న అఖిలప్రియ వివాహం తర్వాత నుంచే మొదలయింది. అప్పటి వరకూ అఖిలప్రియను భూమా వారసురాలిగానే గుర్తించిన కుటుంబం, అనుచరులు ఆ తర్వాత ఈ ప్రశ్నలేవనెత్తారు. దీంతో అఖిలప్రియ కొంత దిగిరావాల్సి వచ్చింది. భూమా వారసుడు తన సోదరుడు విఖ్యాత్ రెడ్డి అని కార్యకర్తల సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందే అనేక మంది భూమా అనుచరులు పార్టీని వీడి వెళ్లిపోయారు. ఇందుకు ఆమె వివాహం కాకపోవచ్చు. భర్త భార్గవ్ రామ్ కులం కాదు. కేవలం ఆమె వ్యవహారశైలి అని ఆళ్లగడ్డలో ఎవరిని అడిగినా చెబుతారు.

చేజేతులా చేసుకుని….

ఇక అఖిలప్రియ మంత్రిగా ఉన్న రోజుల్లో భార్గవ్ రామ్ అంతా తానే అయి చూడటం కూడా భూమా వర్గానికి మింగుడు పడలేదు. దీంతో పాటు భూమా నాగిరెడ్డి అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డితో వివాదాలు కూడా అఖిలప్రియకు కష్టాలు తెచ్చిపెట్టాయి. ఆ ప్రభావం ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాలపై పడింది. బంధువులు, అనుచరులే అఖిలప్రియకు వ్యతిరేకమవుతుంటే ఆ తప్పును సరిదిద్దుకోకుండా ప్రభుత్వం, పోలీసులపై నెట్టడం ఎంతవరకూ అఖిలప్రియ కు సమంజసం అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎస్పీ స్థాయి అధికారి కక్ష కట్టి కేసులు పెట్టడమనేది ఎంతవరకూ నమ్మాలి? అఖిలప్రియ తనకు దూరమైన బంధువర్గాన్ని, సన్నిహితులను తిరిగి తన వద్దకు చేర్పించుకునేందుకే సానుభూతి కోసం కేసులు విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారన్న వ్యాఖ్యలుకూడా విన్పిస్తున్నాయి. ఇక అఖిలప్రియకు మద్దతుగా జిల్లా టీడీపీ నేతలు ఎవరూ నిలబడటకపోవడం కూడా విశేషమే.

Next Story