వంటింట్లో సాయం చేస్తూ.. రోజంతా కూతురితోనే..
By తోట వంశీ కుమార్ Published on 11 April 2020 3:16 PM GMTకరోనా వైరస్(కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి క్రీడారంగం కుదేలైంది. ఈ వైరస్ ముప్పుతో పలు టోర్నీలు రద్దుకాగా.. ఇంకొన్ని వాయిదా పడ్డాయి. మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ ఏప్రిల్ 15 కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించడంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితం అయ్యారు.
అనుకోకుండా లభించిన ఈ విరామాన్ని ఆటగాళ్లు.. తమ కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా గడుపుతున్నారు. రోహిత్, కోహ్లీ, బుమ్రా లాంటి ఆటగాళ్లు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. మరీ టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే మాత్రం అందరికంటే భిన్నం. సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా యాక్టివ్‌గా ఉండడు. తాజాగా ఈ ఆటగాడికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్వీట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది.
ఉదయాన్నే తన కుమారై ఆర్య నిద్రలేవక ముందే వర్క్ ఔట్లు చేస్తానని అందుకు 30 నుంచి 45 నిమిషాలు పడుతుందని తెలిపాడు రహానే. ఆరువాత కరాటే ప్రాక్టీస్ చేస్తానని, తనకు కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా ఉందన్నాడు. నా కూతురు నిద్ర లేచినప్పటి నుంచి తనతో నే ఎక్కువ సమయం గడుపుతానని ఆ సమయంతో తన భార్య ఇంటి పనులు చూసుకుంటుందని చెప్పాడు. అప్పుడప్పుడు వంటిట్లో తన భార్య రాధికకు సహాయం చేస్తానని.. తన కూతురు నిద్ర పోయినప్పుడు పాటలు వినడం, పుస్తకాలు చదవడం చేస్తున్నానని తెలిపాడు ఈ రైట్‌హ్యాండ్ బ్యాట్స్‌మెన్.
పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఎంపికవ్వని ఈ ఆటగాడు టెస్టు క్రికెట్‌లో మాత్రం రెగ్యులర్ ఆటగాడు. న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్‌లో ఆడాడు. ఐపీఎల్ లో మొన్నటి వరకు రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆటగాడిని ఇటీవలే ఢీల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
కాగా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్-13వ సీజన్ ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు లేవు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మరికొంత కాలం పెంచే అవకాశం ఉంది. దీంతో ఈ సారి ఐపీఎల్ సీజన్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.