అంచనా తప్పిందా.. ఏ వయసు ఉన్న వాళ్లకు వైరస్ ఎక్కువగా సోకుతోందంటే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 April 2020 7:59 AM GMT
అంచనా తప్పిందా.. ఏ వయసు ఉన్న వాళ్లకు వైరస్ ఎక్కువగా సోకుతోందంటే..!

భారత్ లో కోవిద్-19 బాధితుల్లో 83 శాతం మంది 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వాళ్ళే..! 21-40 సంవత్సరాల వయసు వాళ్ళకే ఎక్కువగా కోవిద్-19 వైరస్ సోకిందని హెల్త్ మినిస్ట్రీ డేటా తెలిపింది. ఇన్ఫెక్షన్స్ సోకిన వారిలో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళ శాతం 41. ఈ లిస్టును చూస్తుంటే ఎంతో మంది అంచనా తప్పినట్లు అనిపిస్తోంది. సదరు వయసు వారికి కోవిద్-19 వైరస్ సోకడం కష్టం అన్నారు.. తీరా భారత్ లో లెక్కలు చూస్తూ ఉంటే.. వేరేలా ఉన్నాయి.

ఇదే అధికారులను ఎక్కువగా కలవరపెడుతోంది. వయసు పైబడిన వాళ్లకు ఎక్కువగా ఈ వైరస్ సోకుతుందని ముందు నుండి చెబుతూ వస్తున్నారు. కానీ భారత్ లో ఇప్పటి వరకూ నమోదయిన కేసుల్లో 17శాతం మాత్రమే 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఉన్నారు. 21-40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళే ఎక్కువగా ఇతర దేశాలకు వెళ్లి భారత్ కు వచ్చారు . వీరి కారణంగానే కోవిద్-19 భారత్ లో ఎక్కువయిందని అంటున్నారు. వీరిలో ప్రొఫెషనల్స్, విద్యార్థులు కూడా ఉన్నారు.

ఎక్కువ వయసు ఉన్న వాళ్ళే చనిపోతున్నారని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. కోవిద్-19 సోకిన వారిలో డయాబెటిస్, హృద్రోగాలు, హైపర్ టెన్షన్ వంటివి ఉంటే ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు.

కోవిద్-19 వైరస్ సోకిన వాళ్లకు సంబంధించిన ఏజ్ ప్రొఫైల్ అనాలిసిస్ చేయగా భారత్ లో 0-20 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పాజిటివ్ కేసుల శాతం 8.61, 21-40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారి శాతం 41.88, 41-60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ల శాతం 32.82 కాగా.. 60 సంవత్సరాల వయసు పైబడిన వారి శాతం 16.69 గా ఉంది.

కోవిద్-19 పాజిటివ్ కేసుల్లో క్రిటికల్ గా ఉన్న వాళ్లు 58 మంది. వీరు కేరళ, మధ్యప్రదేశ్, ఢిల్లీకి చెందిన వాళ్లు..! హెల్త్ మినిస్ట్రీ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ మాట్లాడుతూ కోవిద్-19 కారణంగా చనిపోతున్న వారిలో ఎక్కువ మంది పెద్ద వయసు ఉన్న వాళ్ళేనని.. డయాబెటిస్, కిడ్నీ సంబంధిత సమస్యలు, హృద్రోగాలు ఉన్న వాళ్ళే ఎక్కువగా చనిపోయారని అన్నారు. హై రిస్క్ క్యాటగిరీలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని.. అన్ని సూచనలను పాటించాలని ఆయన అన్నారు. ప్రభుత్వం, అధికారులు చాలా కష్టపడుతూ ఉన్నామని.. కరోనా మహమ్మారిని అంతం చేయడమే మన లక్ష్యమని ఆయన అన్నారు. ప్రతి రోజూ యుద్ధప్రాతిపదికన తాము పోరాడుతూ ఉన్నామని.. మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ లో కేసులు ఆ స్థాయిలో రెట్టింపు అవ్వలేదని ఆయన అన్నారు.

వైరస్‌ సోకి ఇప్పటికే 3374 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 267 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా ఇప్పటివరకు 77 మంది మరణించారు. మరణించిన వారిలో అత్యధికులు వృద్ధులేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇక దేశంలో రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతూ వెళుతుండం అధికారులను తీవ్రంగా కలవరపెడుతోంది. లాక్ డౌన్ చేసి చాలా మంచిదయ్యిందని లేకపోతే మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేదని అంటున్నారు. వైరస్ బాధితుల సంఖ్య తగ్గే వరకూ లాక్ డౌన్ ను కొనసాగించే అవకాశమే ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

Next Story