కరోనా నుంచి కోలుకున్నాకే అసలు యుద్ధమంతా?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Aug 2020 12:23 PM ISTకరోనా వచ్చింది. దాన్ని జయించామన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. అక్కడెక్కడో వూహాన్ లో పుట్టిన ఈ మాయదారి వైరస్ ఇప్పుడు పక్కింటి వరకూ వచ్చేసింది. మందులేని ఈ మహమ్మారికి సంబంధించి కొత్త విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కరోనా సోకిన తర్వాత పద్నాలుగు రోజులు గడిస్తే చాలు బేఫికర్ అన్న భావన పలువురు వ్యక్తం చేస్తుంటారు. కానీ.. అది చాలా పెద్ద తప్పు అన్న మాట వైద్యుల నోట వినిపిస్తోంది.
నిజానికి కరోనాను జయించిన తర్వాతనే అసలు యుద్ధమంతా మొదలవుతుందన్న మాట పలువురు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కరోనా సోకి నెగిటివ్ రిజల్ట్ వచ్చినంతనే తమ ఆరోగ్యానికి ఢోకా లేదన్న అతి విశ్వాసం ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. అయితే.. భయపడాల్సిన అవసరం లేదు కానీ.. భరోసాతో ఉండటానికి సైతం వీల్లేదన్న మాట వినిపిస్తోంది.
నెగిటివ్ గా తేలిన తర్వాత కనీసం మూడు నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండటం.. క్రమం తప్పకుండా మందులు వాడాల్సిన అవసరం ఉందన్న మాటను పలువురు వైద్యులు చెబుతున్నారు. కరోనా సోకి.. నెగిటివ్ గా తేలిన వెంటనే తాము పెద్ద గండం నుంచి బయటపడినట్లుగా భారీగా ప్రచారం జరుగుతోంది. కానీ.. ఈ భావన చాలా తప్పు అని తేలుస్తున్నారు. ఆ మాటకు వస్తే.. ముప్పు అప్పుడే మొదలైనట్లుగా భావించాలని చెబుతున్నారు.
కరోనా నెగిటివ్ గా తేలిన తర్వాత.. అంతకు ముందున్న వ్యాధులు ముదిరిపోకుండా చూసుకోవటం చాలా అవసరమని స్పష్టం చేస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. గుండె.. మెదడు.. ఊపిరితిత్తులు.. కిడ్నీలాంటి కీలక వ్యవస్థలకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న వైద్యుల మాటను అందరూ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కరోనా పాజటివ్ గా తేలి.. నెగిటివ్ గా మారిన తర్వాత.. న్యూమోనియా తరహాలో ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని భావించారని.. దాని లక్ష్యం ఊపిరితిత్తులు మాత్రమే అనుకున్నా.. రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. శరీరంలోని కీలకమైన మెదడు..కళ్లు. చర్మం.. కాలేయం.. రక్తనాళాలు. గుండె.. కిడ్నీ.. పొట్ట.. క్లోమం.. పేగులను కూడా ఈ వైరస్ ప్రభావితం చేయగలన్న విషయాన్ని మన వైద్యులు గుర్తిస్తున్నారు.
కరోనా నుంచి కోలుకున్నప్పటికీ దాని నుంచి దీర్ఘకాలిక రక్షణ పొందేలా రోగ నిరోధక శక్తి పొందినట్లు కాదన్న విషయాన్ని గుర్తించాలని వైద్యులు చెబుతున్నారు. కరోనా యాంటీబాడీలు కొందరికి మూడు నెలలు.. మరికొందరిలో ఆరు నెలలు క్రియాశీలంగా ఉంటాయని చెబుతున్నారు. యాంటీబాడీలు తగినంతగా డెవలప్ కాకుంటే మరోసారి ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉందంటున్నారు. సో.. కోలుకున్నారని కేర్ లెస్ గా ఉంటే కొంప మునగటం ఖాయం.