అఫ్రీది - గంభీర్.. మీ గొడవ ఆపండంటున్న‌ పాకిస్థాన్ పెద్దాయన.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Jun 2020 7:10 PM IST
అఫ్రీది - గంభీర్.. మీ గొడవ ఆపండంటున్న‌ పాకిస్థాన్ పెద్దాయన.!

షాహిద్ అఫ్రీది- గౌతమ్ గంభీర్.. వీరిద్దరి గొడవ ఇప్పటిది కాదు. షాహిద్ అఫ్రీది గంభీర్ ను ఏదో ఒకటి అనడం.. గంభీర్ అఫ్రీదికి నోరు మూయించే రిప్లై ఇవ్వడం. మైదానంలోనే కాదు సోషల్ మీడియాలో కూడా వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ అన్నది సాగుతూనే ఉంది. ఇక సమయం చూసి షాహిద్ అఫ్రీది భారత్ మీద, కాశ్మీర్ మీద ఏదో ఒక మాట అంటూ ఉంటున్నాడు.. దానికి గంభీర్ అఫ్రీదీకి దిమ్మతిరిగిపోయే సమాధానం చెబుతూ ఉంటాడు. ఇక వీరిద్దరూ సోషల్ మీడియాలో తిట్టుకోవడం ఆపాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ చెబుతున్నారు.

భారత్-పాకిస్థాన్ జట్లు తిరిగి క్రికెట్ ఆడాలంటే షాహిద్ అఫ్రీది, గౌతమ్ గంభీర్ తమ మాటల యుద్ధానికి స్వస్తి పలకాలని అంటున్నారు వకార్ యూనిస్. ఆన్ లైన్ చాట్ షోలో వకార్ యూనిస్ మాట్లాడుతూ ఇకనైనా ఇద్దరూ చల్లబడాలంటూ హితవు పలికారు. గంభీర్, అఫ్రీది మధ్య చాలా సమయం నుండి శత్రుత్వం కొనసాగుతోందని ఇద్దరూ తెలివిగా, సరైన రీతిలో ఆలోచించాలని అన్నారు. ఈ గొడవ కొనసాగుతూ చాలా కాలమే అవుతోందని.. ఇద్దరూ ఎక్కడో ఒక చోట కలిసి మాట్లాడుకుంటే పరిస్థితి చక్కబడుతుందని అన్నారు.

భారత్ పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్ చివరిసారిగా 2012-13లో జరిగింది. అప్పటి నుండి భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తల కారణంగా మరో సిరీస్ చోటుచేసుకోలేదు. దుబాయ్ లో సిరీస్ ను నిర్వహించాలని అనుకున్నా కూడా వీలు పడలేదు. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య అనుబంధం దృఢపడాలంటే ఖచ్చితంగా క్రికెట్ సిరీస్ జరగాల్సిందేనని అంటున్నారు వకార్ యూనిస్. భారత్-పాకిస్థాన్ జట్లు రెగ్యులర్ గా క్రికెట్ సిరీస్ లు ఆడుతూ ఉండాలి. అలాంటప్పుడే క్రికెట్ అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తారు.. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మెరుగవుతాయని అన్నారు.

భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య సిరీస్ అటు పాకిస్థాన్ లో కానీ.. లేదంటే భారత్ లో కానీ జరగాలి.. వేరే దేశంలో జరిగితే అంత మజా ఉండదు. కానీ రాబోయే సంవత్సారాలలో భారత్-పాకిస్థాన్ దేశాలు సిరీస్ ఆడడం మనం చూడబోతున్నామని వకార్ యూనిస్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య క్రికెట్ సిరీస్ జరగాలంటే మాత్రం మొదట ఇరుదేశాల మధ్య ఉన్న ఉద్రిక్త‌త‌లు సద్దుమణగాలి.

Next Story