కోహ్లీకి భయపడడం లేదు.. ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నానన్న 17 ఏళ్ల పాక్ పేసర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Jun 2020 12:56 PM GMT
కోహ్లీకి భయపడడం లేదు.. ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నానన్న 17 ఏళ్ల పాక్ పేసర్

ప్రస్తుతమున్న క్రికెటర్లలో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటగాడు. ఆల్ టైమ్ గ్రేట్ బ్యాట్స్మెన్ లిస్టులో విరాట్ కోహ్లీ ఎప్పుడో చేరిపోయాడు. ప్రస్తుత కాలంలో ఎంతో మంది స్టార్ బౌలర్లు కూడా అతడికి బౌలింగ్ వేయడానికి భయపడుతూ ఉంటారు. మనోడు మంచి టచ్ లో ఉన్నాడంటే బౌలర్లకు ఊచకోతనే..!

కానీ పాకిస్థాన్ కు చెందిన 17 సంవత్సరాల పేస్ సెన్సేషన్ నసీమ్ షా మాత్రం భారత బ్యాటింగ్ స్టార్ కు బౌలింగ్ వేయడానికి రెఢీగా ఉన్నానని చెబుతున్నాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే తనకు గౌరవం ఉందని.. భయపడడం అన్నది మాత్రం జరగదని అంటున్నాడు.

నసీమ్ షా మాట్లాడుతూ 'భారత్ తో మ్యాచ్ జరిగితే ఆ మ్యాచ్ లో తాను మంచిగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తానని.. అవకాశం వస్తే మా అభిమానుల ఆశలను వమ్ము చేయనని.. తనకు విరాట్ కోహ్లీ అంటే గౌరవం ఉందని.. అంతేకానీ భయపడడం లేదని' చెప్పుకొచ్చాడు. బెస్ట్ క్రికెటర్ కు బౌలింగ్ చేయడం అన్నది ఓ ఛాలెంజ్ తో కూడుకున్నదని.. అలాంటప్పుడే కెరీర్ లో ఎదుగుదల అన్నది కనిపిస్తుందని.. విరాట్ కోహ్లీ, భారత్ జట్టుతోనూ తలపడడానికి సిద్ధంగా ఉన్నానని.. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నానని PakPassion.net కు ఇచ్చిన ఇంటర్ వ్యూలో తెలిపాడు.

క్రికెట్ హిస్టరీలో అతి చిన్న వయసులోనే అయిదు వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ గా చరిత్ర లిఖించాడు. అలాగే హ్యాట్రిక్ కూడా తీసుకున్నాడు. కరాచీలో శ్రీలంకతో డిసెంబర్ 2019 న జరిగిన టెస్టు మ్యాచ్ లో అయిదు వికెట్లు తీసుకున్నాడు నసీమ్ షా. రావల్పిండిలో ఫిబ్రవరి 2020 లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో హ్యాట్రిక్ తీశాడు. 16 సంవత్సరాల 307 రోజుల వయసులో అయిదు వికెట్లు తీసి చరిత్ర లిఖించాడు.

ఇక విరాట్ కోహ్లీ కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు వెళుతున్నాడు. టీనేజ్ లో భారత జట్టులో స్థానం సంపాదించిన విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్ గా ఉన్నాడు. టెస్టుల్లో స్టీవ్ స్మిత్, వన్డేల్లో రోహిత్ శర్మతో పోటీ ఉన్నప్పటికీ ది బెస్ట్ అని ఎప్పుడో నిరూపించుకున్నాడు విరాట్ కోహ్లీ.

Next Story