ముషార‌ఫ్.. ధోనీతో ఆ మాట అన్నాడు.. ఆ విష‌యం గంగూలీ చాలా చోట్ల చెప్పాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jun 2020 12:04 PM GMT
ముషార‌ఫ్.. ధోనీతో ఆ మాట అన్నాడు.. ఆ విష‌యం గంగూలీ చాలా చోట్ల చెప్పాడు

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కొత్త‌లో పొడ‌వాటి జుట్టుతో ఉండేవాడు. అత‌డి హేర్ స్టైల్ అంటే చాలా మంది ఇష్ట‌ప‌డే వారు. అందులో అప్ప‌టి పాకిస్థాన్ అధ్య‌క్షుడు ముషార‌ఫ్ ఒక‌డు. 2006లో పాకిస్థాన్‌లో టీమ్ఇండియా ప‌ర్య‌టించింది. ధోని ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌ల‌తో ఆ సిరీస్ ఆద్యంతం ఆక‌ట్టుకున్నాడు. దీంతో ముషార‌ఫ్ కూడా ధోని అభిమానిగా మారిపోయాడు. ఆప‌ర్య‌ట‌న‌లో ఓ సారి భార‌త జ‌ట్టును ముషార‌ప్ క‌లిసారు. అప్పుడు ధోనితో మాట్లాడుతూ.. నీ ఆటతో పాటు నీ హెయిర్ స్టైల్ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని చెప్పారు. ఈ విష‌యాన్ని భార‌త మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలి సైతం ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో చెప్పాడు. 2007 టీ20 వ‌రల్డ్ క‌ప్ అనంత‌రం ధోని ప్ర‌స్తుతం ఉన్న హెయిర్ స్టైల్‌లోకి మారిపోయాడు.

అయితే.. ధోని భార్య సాక్షి సింగ్‌కు మాత్రం ధోని పొడ‌వాటి జ‌ట్టుతో ఉంటే న‌చ్చ‌ద‌ట‌. సోష‌ల్ మీడియా లైవ్‌లో మాట్లాడుతూ.. సాక్షి ఈ విష‌యాన్ని చెప్పింది. తాజాగా చెన్నై సూప‌ర్ కింగ్స్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో రూపా ర‌మ‌ణి అనే మ‌హిళ‌తో సాక్షి లైవ్ చాట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.

రూపార‌మ‌ణి ధోని తొలినాళ్ల‌లోని పొడ‌వాటి జుట్టుతో ఉన్న ఫోటోను చూపించారు. దీనిపై సాక్షి మాట్లాడుతూ.. అది విగ్గ‌ని, షూట్ కోసం వాడార‌ని చెప్పారు. అలాగే ధోని పొడ‌వాటి జుట్టుతో ఉన్న‌ప్పుడు తాను చూడ‌లేద‌ని చెప్పారు. అదృష్టం కొద్ది ధోని పొడ‌వాటి జుత్తుతో ఉన్న‌ప్పుడు నేను చూడ‌లేదు. ఒక‌వేళ నారింజ రంగులోని అలాంటి జుత్తును చూసిన‌ట్ల‌యితే.. అత‌డిని మ‌రోసారి క‌న్నెత్తి కూడా చూసేదాన్ని కాదు. మీకు తెలుసు. శ‌రీర సౌంద‌ర్యం గురించి కొన్ని అభిప్రాయాలుండాలి అని సాక్షి అన్నారు. పొడ‌వాటి జుట్టు జాన్ అబ్రహమ్‌కు బాగుంటుంది కానీ ధోనీకి సూట్ అవ్వదని స్పష్టం చేసింది.

ధోనితో త‌న ప‌రిచ‌యం సినిమాలో చూపించిన‌ట్లుగానే త‌మ ఇద్ద‌రి మ‌ధ్యా జ‌రిగింద‌ని, ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి డైరెక్ట‌ర్ కొంచెం స్వేచ్చ తీసుకున్నార‌న్నారు. క్రికెట్ గురించి పెద్ద‌గా ఏమీ తెలీయ‌ద‌ని, కానీ గంగూలి, స‌చిన్‌, ద్రావిడ్ లాంటి ఆట‌గాళ్లు తెలుసున‌ని చెప్పారు. మా అమ్మ ధోనికి అభిమాని అని నాటి సంగ‌తుల‌ను గుర్తు చేసుకున్నారు.

లాక్‌డౌన్ కావ‌డంతో ధోని ప‌బ్‌జీకీ బానిస‌గా మారిపోయాడ‌ని, నిద్ర‌లో కూడా దాని గురించే క‌ల‌వ‌రిస్తున్నాడ‌ని సాక్షి చెప్పుకొచ్చింది. 'ధోనీ ఎప్పుడూ ఏదో ఒకదాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే వీడియో గేమ్‌లు ఆడుతున్నప్పుడు మాత్రం ఆ ఆలోచనలు మాత్రం ఉండవు. ఆయనకు పబ్‌జీ వ్యసనంగా మారింది. నిద్రలో కూడా దాని గురించే కలవరిస్తున్నాడు' అని చెప్పింది సాక్షి.

Next Story