ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 July 2020 7:22 PM ISTప్రైవేటు పాఠశాలలకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. నిబందనలు అతిక్రమించి ఎవరైనా ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 2020-21కు సంబంధించి విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదని.. ఎవరైనా ఆన్‌లైన్ తరగతులు ప్రారంభిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆగస్టు 3వ తేదీ నుండి స్కూల్స్ ప్రారంభమవుతాయని మంత్రి అన్నారు. అలాగే.. ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడం లేదని తెలిసిందని.. దీనిపై రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ దృష్టి పెడుతుందని అన్నారు. ఉపాధ్యాయుల స్థితి గతులపై గమనిస్తున్నామని.. యూజీ, పీజీ పరీక్షల నిర్వహణపై కేంద్రం నుండి కొన్ని మార్గదర్శకాలు వచ్చాయని మంత్రి తెలిపారు.
అయితే.. పరీక్షల నిర్వహణపై కేంద్రం నుండి అనుమతులు వచ్చిన తరువాతనే చర్యలు తీసుకుంటామని, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత ప్రభుత్వానికి ముఖ్యమని మంత్రి అన్నారు. విద్యార్థులను కరోనా మహ్మరి నుండి కాపాడటంలో ఎలాంటి అలసత్వం వహించమని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.