ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు అదనపు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు

By Newsmeter.Network  Published on  17 May 2020 11:19 AM GMT
ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు అదనపు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు

బంగాళాఖాతంలో వాయుగుండం బలపడి అంఫన్‌ తుపానుగా రాబోతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్రమైన తుఫాను దక్షిణ బెంగాల్‌ కేంద్ర భాగాలపై కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పరదీప్‌ (ఒడిశా)కి దక్షిణాన 980 కిలోమీటర్ల దూరంలో, దిఘా (పశ్చిమ బెంగాల్‌)కు నైరుతిన 1130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆదివారం ఉదయం 11.30 గంటలకు ఖేపుపారా (బంగ్లాదేశ్‌)కు నైరుతి దిశలో 1250 కిలోమీటర్లు దూరంలో ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండి) వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షపాతం నమోదవుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 18న సాయంత్రం నుండి వివిధ ప్రదేశాలలో భారీగా, చాలా ప్రదేశాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షపాతం పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Also Read :రూ. 12వేలలోనే పెండ్లి తంతుపూర్తి

మత్స్యకారులు ఎవరూ వేటకెళ్లొద్దని హెచ్చరించారు. రాబోయే 12 గంటల్లో తుఫాను మరింత తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని, వచ్చే 24 గంటలలో దాదాపు ఉత్తరం వైపుకు నెమ్మదిగా కదిలి, ఆపై ఈశాన్య దిశగా తిరిగి వాయువ్య బంగాళాఖాతం మీదుగా వేగంగా కదిలి, మధ్యాహ్నం / సాయంత్రం సమయంలో దిఘా, హతియా దీవుల (బంగ్లాదేశ్‌) మధ్య పశ్చిమ బెంగాల్‌ - బంగ్లాదేశ్‌ తీరాలను దాటవచ్చునని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) అప్రమత్తమైంది. ఈ తుపాను ప్రభావం అధికంగా పడే అవకాశం ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు అదనంగా రెండు చొప్పున దళాలను పంపించింది. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో రెండేసి చొప్పున ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సాగర్‌ దీవి, కక్‌ద్వీప్‌, ఉలుబెరియా, హస్నాబాద్‌, ఆరాంబాగ్‌, దిఘాలలో మోహరించారు. భారత వాతావరణ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ నెల 18-20 తేదీల మధ్య ఈ తుపాను ఉత్తర ఒడిశా తీరం, పశ్చిమ బెంగాల్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉందని, ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని, దక్షిణ ఒడిశా తీరం వెంబడి సోమవారం సాయంత్రం నుంచి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

Also Read :మహారాష్ట్ర, తమిళనాడుల్లో మే 31 వరకు లాక్‌డౌన్‌

Next Story
Share it