సీనియర్ నటి కరోనా బారిన పడితే కనీసం..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Aug 2020 7:18 AM GMTపేరు చెబితే గుర్తుపట్టలేకపోవచ్చు కానీ.. ఐడెంటిటీ తెలియకపోయినా ఎన్నో సినిమాల్లో చూసి బాగా అలవాటు పడిపోయిన క్యారెక్టర్ ఆర్టస్టులు చాలామందే ఉంటారు. అలాంటి వాళ్లలో సీనియర్ నటి శివపార్వతి ఒకరు. ఆమె పేరు చెబితే మనిషి గుర్తుకు రాకపోవచ్చు కానీ.. ఆమెను చూస్తే మాత్రం మనకు బాగా అలవాటైన నటి అనే విషయం అర్థమైపోతుంది.
వందల సినిమాల్లోనటించిన శివపార్వతి.. ఈ మధ్య సీరియళ్లలో మెరుస్తోంది. వదినమ్మ సీరియల్లో ఆమెది కీలక పాత్ర. శివపార్వతి ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఒక దశలో ప్రాణాపాయ స్థితికి వెళ్లారు. ఎలాగోలా కాస్త కోలుకున్నారు. ఆసుపత్రిలో ఇంకా చికిత్సలో ఉండగానే ఆమె ఆవేదనతో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తోంది.
కరోనా భయం ఉన్నప్పటికీ ధైర్యంగా సీరియల్ షూటింగ్‌లో పాల్గొన్నానని.. కానీ తర్వాత తాను వైరస్ బారిన పడితే మాత్రం సీరియల్ టీంలో ఎవ్వరూ పట్టించుకోలేదని శివ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. సీరియల్ చిత్రీకరణకు ముందు దీని నిర్మాత తనకు సన్మానం కూడా చేశారని.. కానీ ఆపై కరోనా బారిన పడితే మాత్రం ఏమీ చేయలేదని ఆమె అన్నారు. ఈ సీరియల్లో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభాకర్.. కరోనా గురించి ముందు చాలా తేలిగ్గా మాట్లాడారని.. కానీ తాను వైరస్ బారిన పడి విషమ స్థితిని ఎదుర్కొన్నానని.. రెండు హాస్పిటళ్లు మారి ఉత్తమ చికిత్స తీసుకుంటే కానీ కోలుకోలేకపోయానని.. ప్రభాకర్ సైతం తనకేమీ చేయలేదన్నట్లుగా ఆమె మాట్లాడారు. వీళ్లందరికీ తాను ‘థ్యాంక్స్’ చెప్పడం తప్ప ఇంకేమీ చేయలేనన్నారు.
తాను చనిపోయి ఉన్నా కూడా ఇంతకుమించి స్పందన ఏమీ ఉండేది కాదన్న శివపార్వతి.. టీవీ ఆర్టిస్టుల పట్ల వాటి మేకర్స్‌కు ఎలాంటి బాధ్యత ఉండట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు సినిమా షూటింగులు చేయడానికి అందరూ భయపడుతుంటే.. చాలామంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కరోనా బారిన పడుతున్నా సరే.. సీరియళ్ల షూటింగ్‌లు మాత్రం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. శివపార్వతి వీడియోతో వాటి నిర్మాతలు ఆర్టిస్టులు, టెక్నీషియన్ల పట్ల ఏమాత్రం బాధ్యతతో ఉంటున్నారో అర్థమవుతోంది.