బుజ్జిగాడు ఫేమ్ సంజనా అరెస్టు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Sep 2020 7:41 AM GMT
బుజ్జిగాడు ఫేమ్ సంజనా అరెస్టు..!

డ్రగ్స్ కుంభకోణం కన్నడ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. ఇప్పటికే హీరోయిన్ రాగిణి ద్వివేది అరెస్టు అవ్వగా.. తాజాగా బుజ్జిగాడు ఫేమ్ సంజనా గల్రానిని కూడా అరెస్టు చేశారు. సోగ్గాడు, బుజ్జిగాడు, యమహో యమ, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాల్లో నటించింది. కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించింది సంజనా.

S1

ఈరోజు ఉదయం బెంగళూరు ఇందిరానగర్లో వున్న సంజన నివాసంలో సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్ ‌(సీసీబీ) బృందం సోదాలు నిర్వహించిన అనంతరం సంజనని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సీసీబీ ఆఫీస్‌లో సంజనని విచారిస్తున్నారని తెలుస్తోంది. సంజనా ఇంట్లోకి వెళ్లిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమె ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలించారు. సంజనా ఉపయోగిస్తున్న బిఎండబ్ల్యూ కారును పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఇప్పటికే సంజన స్నేహితుడైన రియల్టర్ రాహుల్ శెట్టి ‌ని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ మాఫియాతో రాహుల్‌కు సంబంధాలున్నట్లు అధికారులు తేల్చారు.

రాహుల్‌ శెట్టి ఇచ్చిన సమాచారం ఆధారంగా సంజనా నివాసంలో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించి కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్‌ మాఫియాతో శాండ‌ల్‌వుడ్ లో పలువురు నటీనటులకు సంబంధాలున్నాయని బెంగళూరు సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్ పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కోర్టు అనుమతితో సర్చ్ వారెంట్ తీసుకుని నటి సంజనా గర్లాని ఇంటిలో సోదాలు చేశామని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ జాయింట్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ మీడియాకు చెప్పారు. నటి సంజనాకు డ్రగ్స్ దందాతో సంబంధాలు ఉన్నాయని పోలీసు అధికారులకు కొన్ని సాక్షాలు చిక్కాయని అన్నారు.

డ్రగ్స్ మాఫియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజనా గర్లాని తాను ఏ తప్పు చెయ్యలేదని, తనకు డ్రగ్స్ దందాకు ఎలాంటి సంబంధం లేదని కొన్ని రోజుల నుంచి చెబుతూనే ఉంది. డ్రగ్స్ మాఫియా, సినీ తారలపై గడచిన వారం రోజులుగా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న సామాజిక కార్యకర్త ప్రశాంత్ సంబరగి పై సంజన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే జమీర్ అహ్మద్‌తో తనకు పరిచయం లేదని చెప్పడమే కాకుండా.. ప్రశాంత్ సంబరగిని వీధికుక్కతో పోల్చింది. డ్రగ్స్‌తో సంబంధం లేకున్నా తన పేరును తెరపైకి తెచ్చారని చెప్పుకొచ్చింది. ప్రెస్ మీట్ లో ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టుకుంది సంజనా. ఇంతలో ఆమె అరెస్టు జరగడంతో శాండల్ వుడ్ డ్రగ్స్ రాకెట్ లో సరికొత్త ట్విస్ట్ నమోదయింది.

Next Story