ఆసుపత్రి పాలైన రక్త చరిత్ర నటుడిని ఆదుకోడానికి ముందుకు వచ్చిన సోనూ సూద్

By సుభాష్  Published on  30 July 2020 7:10 AM IST
ఆసుపత్రి పాలైన రక్త చరిత్ర నటుడిని ఆదుకోడానికి ముందుకు వచ్చిన సోనూ సూద్

పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించిన అనుపమ్ శ్యామ్‌ ప్రస్తుతం ఐసీయులో ఉన్న సంగతి తెలిసిందే..! ఆయనకు ఆర్థిక సాయం అందించాలంటూ అనుపమ్ సోదరుడు అనురాగ్ దాతలను అభ్యర్థించారు. ఇది చూసిన ఓ యూజర్ అనుపమ్‌ను ఆదుకోవాలంటూ సోనూసూద్‌ను ట్యాగ్ చేశాడు. దీన్ని చూసిన సోనూ సూద్ సాయం అందిస్తానని హామీ ఇచ్చాడు. వారి కుటుంబంతో టచ్ లో ఉన్నానని తెలిపాడు. ముంబై లోని ఆసుపత్రిలో అనుపమ్ శ్యామ్ కు డయాలసిస్ అందిస్తున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న అనుపమ్ మొన్న రాత్రి డయాలసిస్‌ చేయించిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ముంబైలోని లైఫ్‌లైన్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అనుపమ్ శ్యామ్ రక్త చరిత్ర సినిమాలో కూడా నటించాడు. రామ్ గోపాల్ వర్మ సత్య సినిమాలో కూడా కనిపించాడు.

'మన్ కీ ఆవాజ్ ప్రతిగ్య' అనే సీరియల్ లో ఠాకూర్ సజ్జన్ సింగ్ పాత్రతో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఆయన ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కూడా ఆదుకోడానికి ముందుకు వచ్చింది.

కిడ్నీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఎప్పటికప్పుడు అతనికి డయాలసిస్ చేయించాలని వైద్యులు సూచించారు. మొదట ఆయుర్వేద చికిత్స తీసుకున్నా అది పనిచేయలేదు. మళ్ళీ డయాలసిస్ చేయిస్తే అది బెడిసి కొట్టింది. ఈ మధ్య డయాలసిస్ చేయగా వెంటనే ఆయన కుప్పకూలిపోయాడని తెలుస్తోంది.

Next Story