ఆస్ప‌త్రిలో విలన్ పొన్నాంబళం.. సహాయం చేయడానికి ముందుకొచ్చిన కమల్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 July 2020 8:14 AM GMT
ఆస్ప‌త్రిలో విలన్ పొన్నాంబళం.. సహాయం చేయడానికి ముందుకొచ్చిన కమల్

పొన్నాంబళం ఎన్నో తమిళ సినిమాల్లో విలన్ గా నటించాడు. తెలుగు సినిమాల్లో కూడా కొన్ని ఫైట్ సీక్వెన్స్ కోసం తీసుకుని వచ్చే వాళ్లు..! ఆయన ఆసుపత్రి పాలవ్వడంతో సహాయం చేయడానికి కమల్ హాసన్ ముందుకు వచ్చారు.

పొన్నాంబళం చెన్నై లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. కిడ్నీ సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రిలో చేర్చారు. పొన్నాంబళం పరిస్థితి గురించి తెలుసుకున్న లోకనాయకుడు కమల్ హాసన్ అతడికి ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. పొన్నాంబళం ఆరోగ్యం ఎలా ఉందా అని అతడి కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. పొన్నాంబళం బిడ్డల చదువులకు కూడా తానే సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు.

పొన్నాంబళం తీసుకున్న ఓ సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ఆసుపత్రి బెడ్ మీద పొన్నాంబళం ఉండడం.. ఆక్సిజన్ మాస్క్ తో ఆయన గాలి పీల్చుతూ ఉన్నాడు.

పొన్నాంబళం తమిళ సినిమాల్లో స్టంట్ మ్యాన్ గా కెరీర్ ను మొదలుపెట్టాడు. ఆ తర్వాత కొన్ని క్యారెక్టర్ రోల్స్ చేస్తూ వచ్చాడు. తమిళ, తెలుగు సినిమాల్లో నటించాడు. కమల్ హాసన్ సినిమాలైన అపూర్వ సహోదరులు, మైఖేల్ మదన కామరాజు మొదలైన వాటిలో నటించాడు. ముఖ్యంగా ఫైట్స్ కోసం పొన్నాంబళంను తీసుకునే వారు. కెఎస్ రవికుమార్ నాట్టమాయ్ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

రజనీకాంత్ ముత్తు, అరుణాచలం సినిమాల్లో పొన్నాంబళం కనిపించాడు. అజిత్ అమరకలం, విక్రమ్ సామి సినిమాల్లో కనిపించాడు. జయం రవి, కాజల్ అగర్వాల్ నటించిన కోమలి సినిమాలో పొన్నాంబళం చివరి సారిగా నటించాడు. తమిళ బిగ్ బాస్ సీజన్-2 లో ఒక కంటెస్టెంట్ గా పొన్నాంబళం కనిపించాడు. ఈ షోకు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించాడు. సినిమాల్లోనే కాకుండా పొన్నాంబళం రాజకీయాల్లోకి కూడా ప్రవేశించాడు. పొన్నాంబళం త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు.

Next Story