ఆ రాక్షసుడి ఇంటిని కూల్చేశారు.. పట్టుకోడానికి 25 టీమ్స్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 July 2020 9:40 AM IST
ఆ రాక్షసుడి ఇంటిని కూల్చేశారు.. పట్టుకోడానికి 25 టీమ్స్

ఉత్తరప్రదేశ్ రౌడీ మూకలు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందారు. తప్పించుకుని తిరుగుతున్న రౌడీషీటర్‌ వికాస్‌దూబేను పట్టుకునేందుకు కాన్పూర్‌ సమీపంలోని అతడు నివాసం ఉంటున్న బిక్రూ గ్రామానికి అర్థరాత్రి వెళ్లారు. అతని నివాసానికి పోలీసులు చేరుకుంటున్న క్రమంలో ఇళ్లపైన మాటు వేసిన దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రాసహా మొత్తం 8 మంది పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలమైంది.

వికాస్ దూబేకు చెందిన ఇంటిని కాన్పూర్ జిల్లా అధికారులు కూల్చివేశారు. బుల్డోజర్ల సహాయంతో ఆ ఇంటిని కూల్చివేశారు. వికాస్ దూబే కనిపించకుండా పోయి 36 గంటలు అయింది. ఇంటిని కూల్చి వేస్తున్న వీడియో, అలాగే తెలుగు రంగు కారును కూడా జేసీబీ సాయంతో ధ్వంసం చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. 500 కు పైగా మొబైల్ ఫోన్ లపై పోలీసులు నిఘా ఉంచారు. సమాచారం ఇచ్చిన వారికి 50,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ఇస్తామంటూ అధికారులు తెలిపారు.

వికాస్ దూబేను పట్టుకోడానికి ఏకంగా 25 టీమ్ లను ఏర్పాటు చేశారు. వికాస్ దూబేను, దూబే అనుచరులను పట్టుకోడానికి 25 టీమ్లను ఏర్పాటు చేశామని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మోహిత్ అగర్వాల్ మీడియాకు తెలిపారు. వివిధ జిల్లాల్లో రైడ్స్ నిర్వహిస్తూ ఉన్నామని, ఇతర రాష్ట్రాల్లో కూడా నిఘా ఉంచామని అన్నారు. లక్నో లోని కృష్ణా నగర్ ఏరియాలోని దూబే ఇంటిని కూడా జల్లెడ పట్టారు పోలీసులు.

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్పూర్ కు చేరుకుని చనిపోయిన పోలీసుల కుటుంబాలను పరామర్శించారు. చనిపోయిన ఒక్కో పోలీసు కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు.

60కేసుల్లో నిందితుడిగా ఉన్న వికాస్‌దూబేను పట్టుకునేందుకు గురువారం అర్థరాత్రి పోలీసులు వెళ్లగా.. ఓ ఇంటిపై మాటువేసిన దుండగులు పోలీస్‌ బృందంపై బులెట్ల వర్షం కురింపించారు. దీంతో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా ముగ్గురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను వికాస్ దూబే అనుచరులు తీసుకుని వెళ్లిపోయారు.

Next Story