ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం... భారీగా అక్రమ ఆస్తులు
By సుభాష్ Published on 13 Dec 2019 3:34 AM GMTఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఈ అవినీతిలో మిరుమిట్లు గొలిపించే బంగారు అభరణాలు, వెండి వస్తువులు, ఖరీదైన గడియారాలు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రీకల్ వస్తువులు, భారీ ఎత్తున నగదు బట్టబయలు కావడంతో అధికారులే నివ్వెరపోయారు. విద్యుత్తు శాఖలో డీఈగా పనిచేస్తున్న వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాల్లో వెలుగు చూసిన సొత్తు ఇది. ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ రమణకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్‌లో కొత్తగా నిర్మించిన ఓ అపార్ట్‌మెంట్‌కు ట్రాన్స్‌ఫార్మర్, ప్యానల్‌బోర్డులను మంజూరు చేసేందుకు రూ. 30 వేలు లంచం ఇవ్వాలని నానల్‌నగర్ చౌరస్తాలోని టీఎస్‌ఎస్పీడీసీఎల్ డీఈ వెంకటరమణ డిమాండ్ చేశాడు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చుకోలేనని సదరు కాంట్రాక్టర్ శివకుమార్ తెలుపడంతో, వెంకటరమణ రూ. 25 వేలకు దిగివచ్చాడు. వెంటనే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ డిమాండ్ చేశాడు. ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు, అధికారికి రూ. 25 వేలు లంచం ఇస్తుండగా.. వెంకటరమణను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈమేరకు అతని కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు జరిపి కొన్ని ఫైళ్లను జప్తుచేశారు. అనంతరం మాదాపూర్‌లోని సైబర్‌సిటీ మీనాక్షి స్కైలాన్ టవర్స్‌లో ఉన్న వెంకటరమణ ఇంట్లో భారీగా సోదాలు జరిపారు. అర్ధరాత్రి వరకు జరిగిన ఈ సోదాల్లో వెంకటరమణ అవినీతి చిట్టా బట్టబయలైంది. 60 తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.26.40 లక్షల నగదు, రూ.2.92 కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాలు, ఎలకా్ట్రనిక్ ఉపకరణాలను సీజ్ చేశారు. సొత్తు విలువ రూ.3.50 కోట్లుగా ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు.ఇంకా ఎక్కడెక్కడ అక్రమ ఆస్తులున్నాయో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.