ఆరోగ్యసేతు:బగ్ కనిపెడితే రూ.3 లక్షలు
By సుభాష్ Published on 27 May 2020 5:15 AM GMTఆరోగ్యసేతు యాప్‌లోని మూడు భద్రతాపరమైన అంశాలకు సంబంధించి బగ్స్ కనిపెట్టి చెప్పినవారికి లక్ష రూపాయల చొప్పున మూడు లక్షల రూపాయల వరకూ బహుమతి ఇవ్వనున్నట్లు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ డైరెక్టర్ జనరల్ నీతా వర్మ ప్రకటించారు. యాప్ ఓపెన్‌సోర్స్ కోడ్ విడుదల సందర్భంగా మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. అయితే కోడ్ మెరుగుదలకు మంచి సూచనలు, సలహలు చేసిన వారికి మరో లక్ష రూపాయల బహుతి కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు.
కాగా, ప్రభుత్వరంగంలో ఒక యాప్‌కు సంబంధించి బహుమతి ప్రకటించడం ఇదే మొదటిసారి. ఆరోగ్యసేతు యాప్‌ను పూర్తిస్థాయిలో ఓపెన్‌సోర్స్ ప్లాట్‌ఫాంగా డెవలప్ చేశామని, ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఈపాస్ జారీ చేసినట్లయితే అది ఈ యాప్‌తో అనుసంధానం అవుతుందని, ప్రత్యేకంగా పాస్ కాపీ పట్టుకోవాల్సిన అవసరం ఏ మాత్రం ఉండదని స్పష్టం చేశారు.
అలాగే ఆన్‌లైన్ డెలివరీ బాయ్స్ అంతా ఈ యాప్ ఉపయోగించాలని చెప్పామని ఐటీ శాఖ కార్యదర్శి అజయ్‌సాహ్ని తెలిపారు. ఐసీఎంఆర్ ల్యాబ్‌లలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారికి మాత్రమే ఆరోగ్యసేతు యాప్‌లో ఎరువు రంగు కనిపిస్తుందన్నారు. లేత ఆకుపచ్చ, పసుపు, ఆరెంజ్ రంగులు కేవలం హెచ్చరికకు సంకేతాలని చెప్పారు. వాటిని వినియోగదారులు గుర్తించి తగు జాగ్రత్తలు సూచనలు తీసుకోవాలన్నారు. ఈ యాప్ వల్ల ఎంతో ఉపయోగం ఉందని, ఇప్పటి ఈ యాప్‌ను ఎంతో మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపారు.