మావోల చెరనుండి భర్తను విడిపించుకున్న భార్య
By Newsmeter.Network Published on 14 May 2020 3:01 PM ISTచత్తీస్‌గడ్ అడవుల్లో నిత్యం పోలీసులు వర్సెస్ మావోయిస్టుల మధ్య పోరుసాగుతూనే ఉంటుంది. అక్కడి ప్రజలు తుపాకుల శబ్దం మధ్యనే జీవనం సాగిస్తుంటారు. ఆ అటవీ ప్రాంతాల్లో ఉండే గ్రామాల్లో మావోల ఆధిపత్యం ఎక్కువే. ఆ ప్రాంతాల్లో పనిచేసే పోలీసులను కిడ్నాప్ చేసి మావోలు హత్యలు చేసిన ఘటనలు ఉన్నాయి. తాజాగా ఓ పోలీస్‌ను మావోయిలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న భార్య నేరుగా మావోల వద్దకు వెళ్లి తన భర్తను విడిపించుకొని వచ్చింది. ఇంతకీ తన భర్తను విడిపించుకొనేందుకు ఆమె ఏం చేసింది.. మావోలు ఎందుకు వదిలిపెట్టారో ఈ కథనం చదవాల్సిందే..
Also Read :హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు.. కానీ..!
చత్తీస్‌గడ్ రాష్ట్రం సుక్మా జిల్లా జేగురుకొండకు చెందిన సంతోష్ కట్టమ్ 48ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్. బీజాపూర్ జిల్లా భూపాలపట్నం పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. భార్య సునీత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గోరానా గ్రామంలో నివాసముంటున్నాడు. ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చేందుకు బయటకు వెళ్లాడు. కాపుకాసి మావోలు అతన్ని కిడ్నాప్‌చేసి.. అడవుల్లోని తమ స్థావరాలకు తీసుకెళ్లారు. మే 3న ఈ ఘటన జరిగింది. భర్త ఎంతకీ ఇంటికి రాకపోవటంతో భార్య కంగారుపడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజుల తరువాత మావోలు కిడ్నాప్ చేశారని తెలుసుకొని హడలిపోయింది. తన భర్తను ఏమైనా చేస్తారేమోనని కంగారుపడింది. పాలీసులుసైతం కిడ్నాపైన పోలీసును మావోల చరనుండి విడిపించే ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు భార్య సునీతసైతం తన భర్తను విడిపించుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కుటుంబ సభ్యులు వారించినా తన ఇద్దరు పిల్లలను వారికి అప్పగించి తన 14ఏళ్ల కూతురు, కొందరు గ్రామస్తులతో కలిసి అడవిబాట పట్టింది.
Also Read :తల్లిపాలతో కరోనా సోకదు!
నాలుగు రోజుల పాటు అడవిలో ప్రయాణం చేసిన తరువాత మే10న నక్సల్స్ ఉండే స్థావరానికి చేరుకున్నారు. భర్త మావోల చరలో సజీవంగానే ఉండటంతో ఊపిరిపీల్చుకుంది. తన భర్తను వదిలిపెట్టాలని మావోలను వేడుకుంది. తన భర్తలేకపోతే తాను, తన పిల్లలం దిక్కులేని వాళ్లం అవుతామని, తన భర్తను విడిచిపెట్టాలని మావోలను వేడుకుంది. సునీత ఆవేదనను అర్థంచేసుకున్న మావోలు ప్రజాకోర్టు నిర్వహించారు. చివరకు సంతోష్ కట్టమ్‌ను విడిచిపెట్టేందుకు ఒప్పుకున్నారు. కానీ ఓ షరతు విధించారు. పోలీస్ ఉద్యోగం మానివేయాలని, లేకుంటే ఈసారి తీవ్రపరిణామాలు ఉంటాయని మావోలు సునీతకు సూచించారు. దీంతో సునీత వారికి ఆమేరకు హామీ ఇచ్చి తన భర్తను తనవెంట తీసుకొచ్చుకుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, బంధువులు సునీత సాహసానికి ఆశ్చర్యపోయారు. ఈ విషయంపై సునీతను మీడియా ప్రశ్నించగా.. మనకు సమస్య వచ్చిందని విచారిస్తూ కూర్చునే కంటే మనమే దాన్ని పరిష్కరించుకోవటానికి యత్నించాలని చెప్పింది.
Also Read :బస్సు, ట్రక్కు ఢీకొని వలస కూలీలు మృతి