హైదరాబాద్‌ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు.. కానీ..!

By Newsmeter.Network  Published on  14 May 2020 6:03 AM GMT
హైదరాబాద్‌ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు.. కానీ..!

కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించాయి. ఈ లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. నెలన్నరగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఇండ్లకే పరిమితం కావటం, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవటంతో తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండ్లకు వెళ్లేందుకు పలుసార్లు ప్రయత్నించినా అటు ఏపీ ప్రభుత్వం రానివ్వకుండా, ఇటు తెలంగాణ ప్రభుత్వం బయటకు వెళ్లనివ్వక పోవటంతో తెలంగాణలోనే ఉండిపోయారు.

Also Read :బస్సు, ట్రక్కు ఢీకొని వలస కూలీలు మృతి

దీంతో తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉండిపోయిన ఏపీ వాసులు తమ స్వస్థలాలకు చేరుకొనేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. అయితే ఈ బస్సుల్లో ప్రయాణించాలంటే తొలుత స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో చిక్కుకుపోయిన దాదాపు 13వేల మంది తాము స్వగ్రామాలకు వెళ్లిపోతామని స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో హైదరాబాద్‌ పరిధిలో 8వేల మంది ఉండగా, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఐదువేల మంది ఉన్నారు. వీరిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం నాన్‌ ఏసీ, ఏసీ బస్సులు నడపనుంది. ఏసీ బస్సులో గరుడ చార్జీలు, నాన్‌ ఏసీ బస్సుల్లో సూపర్‌ లగ్జరీ చార్జీలను వసూలు చేయనున్నారు. ఈ ప్రత్యేక బస్సులు మియాపూర్‌ - బొల్లారం క్రాస్‌ రోడ్‌, కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు, ఎల్బీనగర్‌ నుంచి బయలుదేరుతాయి. నాన్‌స్టాప్‌ ప్రయాణంతో తమ గమ్య స్థానాలకు చేరుకోనున్నాయి. అయితే ఈ బస్సుల్లో ప్రయాణించాలంటే ఏపీ ప్రభుత్వం ఓ కండీషన్‌ పెట్టింది. ఈ బస్సుల ద్వారా తమతమ ప్రాంతాలకు చేరుకున్న తరువాత ఆయా జిల్లా కేంద్రాల్లో క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది. అందుకు ఒప్పుకుంటే టికెట్లు మంజూరు చేయటం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read :సంచలన నిర్ణయం: సడన్‌గా షాకిచ్చిన భారత రైల్వేశాఖ..రైళ్లన్నీ రద్దు..!

Next Story