రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వే.. అందుకేనా.!

By అంజి  Published on  25 March 2020 4:16 AM GMT
రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వే.. అందుకేనా.!

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి సమగ్ర సర్వే నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను నమోదు చేయాలని నిర్దేశించారు. సమగ్ర సర్వే కోసం వాలంటీర్లు, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలను వినియోగించుకోవాలని సీఎం జగన్‌ తెలిపారు. మంగళవారం నాడు క్యాంప్‌ ఆఫీసులో సీఎం జగన్‌ రాష్ట్రంలో కరోనా వైరస్‌ పరిస్థితిపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఏపీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీఎంసీ చైర్మన్‌ సాంబశివారెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read: ట్రంప్ మాట విని ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు

రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వేను గురువారం లోపు పూర్తి చేయాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఆ తర్వాత కూడా తాజా వివరాలను ఎప్పటికప్పుడు పొందుపర్చాలన్నారు. సర్వే సమయంలో కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్న వారు ఎవరైనా ఉంటే.. వారిని తక్షణమే ఆస్పత్రికి తరలించాలన్నారు. ఈ సర్వేతో రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని సీఎం జగన్‌ అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. సర్వేకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు, వారితో కలిసి ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నందున ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలన్నారు. అప్పుడే సమగ్ర సర్వేకు సహకరించిన వారవుతారని సీఎం జగన్‌ వివరించారు. కరోనా వైరస్‌ వ్యాపించకుండా ఉండాలంటే వైద్య ఆరోగ్య శాఖ సూచనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. అయితే ఈ సర్వే ద్వారా వచ్చే సమాచారంతో కరోనా వైరస్‌ నివారణకు మరిన్ని చర్యలు చేపడతామన్నారు.

Also Read: స్పెయిన్‌లో దారుణం.. సైన్యం కంటపడిన ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు

Next Story
Share it