ఒక్క రనౌట్.. కోట్లాది మంది ఆశలు ఆవిరి.. ఏడాది పాటు క్రికెట్‌కు దూరం
By తోట వంశీ కుమార్ Published on 10 July 2020 10:57 AM GMTఅది 2019 జూలై 10. కోట్లాది మంది భారతీయులు టీవీలకు అతుక్కుపోయారు. ఒక్క రనౌట్‌తో వారి ఆశలు ఆవిరి అయిపోయాయి. అదే.. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్. వరుణుడు అడ్డంకి కలిగించడంతో రెండు రోజుల పాటు ఆ మ్యాచ్ జరిగింది. మొదటి బ్యాటింగ్ చేసిన కీవీస్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. భారత జట్టు సునాయాసనంగా లక్ష్యాన్ని చేధింస్తుందని అంతా బావించారు. భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఆ టోర్నీలో ఐదు శతకాలు బాది పుల్ ఫాంలో ఉన్నాడు. మరో ఓపెనర్ రాహుల్ పాటు కోహ్లీ, రిషబ్, పాండ్యా, ధోని ఉండడంతో ఫైనల్‌కు వెళ్లడం లాంఛమేనని చాలా మంది బావించారు. అయితే.. కోట్లాది మంది ఆశలు అడియాశలు కావడానికి ఎంతో సమయం పట్టలేదు. భారత ఇన్నింగ్స్ ఇలా ఆరంభం అయ్యిందో లేదో.. రాహుల్(1), రోహిత్ శర్మ(1), కోహ్లీ (1) పూర్తిగా విఫలం కావడంతో.. 5 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరువాత రిషబ్ పంత్(32), హార్దిక్ పాండ్యా(32) ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే.. మరోసారి కివీస్ బౌలర్లు విజృంభించడంతో.. భారత జట్టు 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో భారత మాజీ కెప్టెన్ ధోని(50), ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా లు ఏడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 116 పరుగులు జోడించారు. ముఖ్యంగా జడేజా 59 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 77 పరుగులు చేశాడు. దీంతో భారత జట్టు గెలుపుపై ఆశలు చిగురించాయి. అయితే.. జడేజా భారీ షాట్ ఆడబోయి విలియమ్ సన్ చేతికి చిక్కాడు. ఆ వెంటనే మార్టిన్ గుప్టిల్ విసిరిన ఓ అద్భుత త్రోకు ధోని రనౌట్ అయ్యాడు. దీంతో కోట్లాది మంది భారత అభిమానుల ఆశలు ఆవిరి అయ్యాయి. ధోని అవుట్ అయిన తరువాత, భారత్ 9 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి వచ్చింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ భువనేశ్వర్ కుమార్ (0), యుజ్వేంద్ర చాహల్ (5), జస్ప్రీత్ బుమ్రా (0) ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. మొత్తం భారత జట్టు 49.3 ఓవర్‌లో 221 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కివీస్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 2019 ప్రపంచ కప్‌లో భారత జట్టు ప్రయాణం ముగిసింది.
ఇక భారత జట్టు జెర్సీలో ధోని కనిపించడం ఇదే చివరిసారి. ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్ తర్వాత ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం తీసుకున్నాడు. ఇంత వరకు మళ్లీ బ్యాట్ మైదానంలో కనిపించలేదు. కాగా.. ఈ మ్యాచ్ జరిగి నేటికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఓ ట్వీట్ చేసింది. ఆ మ్యాచ్ హైలెట్స్‌ను అభిమానులతో పంచుకుంది. ఐపీఎల్‌లో సత్తా చాటి ఘనంగా రీ ఎంట్రీ ఇవ్వాలని ధోని బావించాడు. అయితే.. కరోనా మహమ్మారి కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది. అయితే.. టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించలేమని ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రకటించగా.. ఆ విండోలో ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.