కరోనా ఎఫెక్ట్‌.. కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ.. ఎంతగా అంటే..

By Newsmeter.Network  Published on  7 April 2020 6:55 AM GMT
కరోనా ఎఫెక్ట్‌.. కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ.. ఎంతగా అంటే..

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తుంది. ఈ మహమ్మారి భారిన పడి అగ్ర దేశాలుసైతం విలవిల్లాడుతున్నాయి. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. మరోవైపు భారత్‌లోనూ కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇదిలాఉంటే కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించింది. దీంతో దేశంలోని అత్యవసర సేవలు మినహా అన్ని మూతపడ్డాయి. ఎవరింటికి వారు పరిమితమైయ్యరు. ఆదాయం, వ్యయాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా కరోనా రూపంలో భారీ విపత్తు రావడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పుడిప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతున్న తరుణంలో కరోనా మహమ్మారి గట్టిదెబ్బకొట్టింది. ఈ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపైనా పడింది.

Also Read :హాట్‌స్పాట్లపై డేగకన్ను.. కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం!

నిన్నమొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా కొంత మెరుగైన దశలోనే ఉంది. కానీ ప్రస్తుతం కరోనా దెబ్బతో అన్ని మూతపడిపోవటం, ఆదాయం పూర్తిగా తగ్గిపోవటంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌ సోమవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. కరోనా దెబ్బతో ఆర్థిక రంగం దెబ్బతింటున్న మాట వాస్తవమేనని చెప్పారు. దేశం ఆర్థిక రంగంపైనేకాక తెలంగాణ ఆర్థిక రంగంపైనా వైరస్‌ ప్రభావం ఉందని అన్నారు. లాక్‌డౌన్‌ విధించడం వల్ల ఆర్థికంగా రాష్ట్రం నష్టపోతున్న మాట వాస్తవమేనన్న కేసీఆర్‌.. రోజుకు రూ. 400 నుండి 440 కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉంటే కేవలం కొద్దిశాతం ఆదాయమే సమకూరుతుందని అన్నారు. ఏప్రిల్‌ ఆరు రోజుల్లోనే రూ. 2400 కోట్ల మేరకు ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ. 6కోట్లు మాత్రమే వచ్చిందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. అయినా మనకు ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవటం ముఖ్యం కాదని, మనుస్సుల ప్రాణాలే ముఖ్యమని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం వైరస్‌ ప్రభావం తగ్గాలంటే మరికొద్దిరోజులు లాక్‌డౌన్‌ విధించాలని కేంద్రానికి సూచిస్తానని, ఆర్థికంగా నష్టపోతే కరోనా ప్రభావం తగ్గిన తరువాత మళ్లి రికవరీ చేసుకోవచ్చని కేసీఆర్‌ తేల్చిచెప్పారు.

Also Read :ఐసీయూలో బ్రిటన్‌ ప్రధాని.. త్వరగా కోలుకోవాలని మోదీ ట్వీట్‌

కేసీఆర్‌ వ్యాఖ్యలతో అధికశాతం ప్రజల నుండి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఆర్థిక రంగం నిపుణులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ వల్ల దేశంలోని అన్ని రాష్ట్రాలపై ఆర్థికపరంగా భారీ నష్టం వాటిల్లుతుందని పేర్కొంటున్నారు. ఇప్పటికే లాక్‌ డౌన్‌ వల్ల పేద వర్గాల ప్రజలతో పాటు పారిశ్రామిక వేత్తలపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని, ఆర్థికంగా ఆయా వర్గాలు చితికిపోతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. సీఎం కేసీఆర్‌ చెప్పినట్లు కరోనా ప్రభావం తగ్గాక ఆర్థిక వ్యవస్థను మళ్లి మెరుగుపర్చుకోవచ్చని, కానీ ఇప్పుడున్న స్థాయిలోకి మళ్లి రావాలంటే మళ్లి ప్రజల నుంచే రాబట్టాల్సి వస్తుందని పులువురు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో అప్పుడు కూడా ప్రజలపై భారాలు తప్పవని అంటున్నారు. కరోనాను తరిమికొట్టాలంటే లాక్‌డౌన్‌ తప్పనిసరి అని, కానీ అదే సమయంలో లాక్‌డౌన్‌ నుండి కొన్ని వర్గాలను మినహాయిస్తే ఆర్థికంగానూ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత వెసులుబాటు ఉంటుందని, పలువురు పేర్కొంటున్నారు.

Next Story
Share it