కొవిడ్-19 ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Aug 2020 4:47 AM GMT
కొవిడ్-19 ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

అహ్మదాబాద్: కొవిడ్ 19 ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ఎనిమిది మంది మరణించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. గురువారం ఉదయం మూడు గంటల సమయంలో అహ్మదాబాద్ నవరంగ్ పుర ప్రాంతంలోని శ్రే ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకుని వచ్చింది.

మొత్తం ఎనిమిది మంది ఈ ఘటనలో మరణించారు. అయిదుగురు మగవాళ్లు, ముగ్గురు మహిళలు మరణించారు. వీరు ఐసీయు వార్డులో చికిత్స చేయించుకుంటూ ఉండగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 50 బెడ్స్ ఉన్న ఆసుపత్రిలో 45 మంది పేషెంట్స్ చికిత్స తీసుకుంటూ ఉన్నారు. వీరిని వెంటనే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసర్చ్ ఆసుపత్రికి తరలించారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆయన దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ లో చోటుచేసుకున్న ఈ ఘటనపై చాలా బాధగా ఉందని.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో మాట్లాడానని తెలిపారు.

ఆసుపత్రిలో చిక్కుకున్న వాళ్ళను బయటకు తీసుకుని వస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. విజయ్ రూపానీ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రస్తుతానికి ఆసుపత్రికి సీల్ వేశారు.

ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గాయపడిన వారికి 50వేల రూపాయలు సాయాన్ని అందిస్తున్నట్టు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.



Next Story